Waqf Act Amendment Bill: వక్ఫ్ చట్ట సవరణ 2025పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా దేశ అత్యున్నత న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు సోమ‌వారం కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. 

వక్ఫ్ చట్ట సవరణ 2025పై సుప్రీం కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. మతపరమైన ఆస్తుల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన ఈ సవరణలు రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు లేవ‌నెత్తిన నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ఈ చట్టంలోని కొన్ని నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర తీర్పు ఇచ్చింది.

కీలక అంశాలపై స్టే

సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం చట్టం మొత్తాన్ని రద్దు చేయడానికి తగిన కారణాలు లేవు. అయితే, కొన్ని నిబంధనలు మౌలిక హక్కులకు విరుద్ధమయ్యే అవకాశముందని గుర్తించింది. అందువల్ల ఆ సెక్షన్లపై అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.

నిలిపివేసిన‌ నిబంధనలు

సెక్షన్ 3(r): వక్ఫ్‌కు ఆస్తిని దానం చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాం ఆచరించి ఉండాలన్న నిబంధనను నిలిపివేసింది. సరైన నియమాలు లేకుండా ఇది అధికార దుర్వినియోగానికి దారితీయవచ్చని కోర్టు అభిప్రాయప‌డింది.

సెక్షన్ 2(c): నియమిత అధికారి నివేదిక ఇవ్వకపోతే ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధనను కూడా నిలిపివేసింది. ఆస్తి హక్కులపై నిర్వాహక అధికారి తీర్పు ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించింది.

సెక్షన్ 3C: రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడానికి కలెక్టర్‌కు ఇచ్చిన అధికారాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇది అధికార విభజన సూత్రానికి వ్యతిరేకమని, తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావితం కాకూడదని స్పష్టం చేసింది.

కొనసాగుతున్న ఇతర నిబంధనలు

వక్ఫ్ బోర్డులో ముస్లిం కాని సభ్యుల సంఖ్య రాష్ట్ర స్థాయిలో మూడు, జాతీయ స్థాయిలో నాలుగు దాటకూడదనే నిబంధన కొనసాగుతుంది.

బోర్డు ఎక్స్-ఆఫీసియో అధికారిగా తప్పనిసరిగా ముస్లిం సమాజానికి చెందినవారే ఉండాలని కోర్టు సూచించింది.

వక్ఫ్ బోర్డు CEO విషయంలో, ముస్లిం కాని వ్యక్తిని నియమించే నిబంధనను మాత్రం సుప్రీంకోర్టు నిలిపివేయలేదు.

సుప్రీంకోర్టు పరిశీలనలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ వ్యాఖ్యానిస్తూ.. 1923 నుంచి వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు కనిపించలేదని తెలిపారు. రాజ్యాంగబద్ధతపై అనుమానం ఉన్నప్పటికీ, చట్టాన్ని పూర్తిగా నిలిపివేయడం అరుదైన సందర్భాల్లోనే సాధ్యమని స్పష్టం చేశారు. తుది తీర్పు వచ్చే వరకు వక్ఫ్ ఆస్తుల స్వాధీనం, హక్కులపై ప్రభావం ఉండదని స్పష్టంచేశారు.