
Indian Army : ఇండియన్ ఆర్మీ బలమేంటో 'ఆపరేషన్ సింధూర్' సమయంలోనే యావత్ ప్రపంచానికి అర్థమైపోయింది. పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి సత్తాచాటింది మన వైమానికి దళం. ఆ తర్వాత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన పాక్ ను వరుస దాడులతో ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువులు నీళ్లు తాగించింది. దీంతో భారత ఆర్మీ మరీముఖ్యంగా వైమానిక దళం ఎంత బలమైనదో బైటపడింది.
అయితే తాజాగా భారత వాయుసేన అత్యంత శక్తివంతమైన దేశాల సరసన చేరింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) రూపొందించిన ప్రపంచవ్యాప్తంగా పవర్ ఫుల్ వైమానిక దళాల ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్ 3 లోకి చేరింది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో అత్యుత్తమ రక్షణ చర్యలు చేపడుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చైనాను అధిగమించింది. WDMMA ర్యాకింగ్ప్ లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, రష్యా రెండో స్థానంలో నిలిచింది. తాజాగా భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా చైనా వైమానిక దళం నాలుగో స్థానానికి దిగజారింది.
ప్రపంచ వైమానిక దళాల ర్యాంకింగ్స్ ప్రకారం... యూఎస్ వైమానిక దళం 242.9 ట్రూ వాల్యూ రేటింగ్ తో టాప్ లో నిలవగా, రష్యా 114.2 రేటింగ్‌తో తర్వాతి స్థానంలో ఉంది. భారత్ 69.4 రేటింగ్ సాధించి ప్రపంచంలోనే మూడో అత్యంత పవర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్ గా నిలిచింది. చైనా 63.8తో భారత్ కంటే వెనుకబడింది. ఇతర ముఖ్యమైన దేశాల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే జపాన్ (58.1), ఇజ్రాయెల్ (56.3), ఫ్రాన్స్ (55.3), యూకే (55.3) ఉన్నాయి. పాకిస్థాన్ రేటింగ్ 46.3గా ఉంది. మొత్తం 103 దేశాలకు చెందిన 120 రకాల వైమానిక సేవలను విశ్లేషించి ఈ ర్యాంకులు కేటాయించారు.
భారత వైమానిక దళం చాలా సమతుల్యతను ప్రదర్శిస్తోందని వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తెలిపింది. ఐఏఎఫ్ వద్ద 31.6% ప్రత్యేక ఫైటర్ విమానాలు, 29% హెలికాప్టర్లు, 21.8% శిక్షణ విమానాలు ఉన్నాయి. చైనా వైమానిక దళంలో ఫైటర్ల నిష్పత్తి 52.9%, శిక్షణా విమానాలు 28.4% ఎక్కువగా ఉన్నప్పటికీ భారత్ సమతుల్యమైన వైమానిక దళ నిర్మాణాన్ని కలిగి ఉందని ఈ నివేదిక స్ఫష్టం చేసింది.
భారత్ ప్రస్తుతం డస్సాల్ట్ రఫేల్, సుఖోయ్ సు-30 ఎంకేఐ, స్వదేశీ తేజస్ ఫైటర్లతో పాటు మిగ్-29, మిరాజ్ 2000 వంటి నాలుగో తరం విమానాలను కలిగివుంది. అలాగే అధునాతన 4.5-జనరేషన్ వంటివి కూడా ఐఏఎఫ్ నడుపుతోంది. భవిష్యత్తులో ఎల్‌సీఏ-ఎంకే1ఏ, ఎల్‌సీఏ-ఎంకే2, ఎంఆర్‌ఎఫ్‌ఏ, ఏఎంసీఏ వంటి దేశీయంగా అభివృద్ధి చేసిన ఫైటర్ జెట్స్ వైమానికదళంలో చేరనున్నాయి. చైనా ఇన్వెంటరీలో ఐదో తరం జె-20, జె-35 విమానాలతో పాటు 4.5 తరం జె-10సి, జె-16 జెట్‌లు ఉన్నాయి.
విమానాల సంఖ్య, కార్యాచరణ సామర్థ్యాలు, మౌలిక సదుపాయాలు, సంసిద్ధత స్థాయిలు.. వంటి అనేక విషయాలను పలు కోణాల్లో పరిశీలించిన ర్యాంకులు కేటాయించారు. ఇలా ప్రపంచ వైమానిక దళాలను అంచనా వేయడానికి WDMMA ఈ కొలమాన వ్యవస్థను అభివృద్ధి చేసింది.
ఈ సంస్థ పద్ధతి కేవలం విమానాల సంఖ్యను లెక్కించడమే కాకుండా, ఆధునికీకరణ ప్రయత్నాలు, లాజిస్టికల్ సామర్థ్యాలు, దాడి, రక్షణ సామర్థ్యం, ఫ్లీట్ కూర్పు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రత్యేక మిషన్ విమానాలు, వ్యూహాత్మక బాంబర్లు, క్లోజ్ ఎయిర్ సపోర్ట్ సామర్థ్యాలు, శిక్షణా కార్యక్రమాలు, ప్రణాళికాబద్ధమైన కొనుగోళ్లు వంటివాటిని పరిగణలోకి తీసుకుంటుంది. దేశీయ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలు, వైవిధ్యం, కార్యాచరణ అనుభవం వంటివి అదనంగా పరిగణించే అంశాలు.
యూఎస్ సైన్యంలోని ప్రతి విభాగాన్ని (ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఏవియేషన్, మెరైన్ కార్ప్స్) వాటి స్వతంత్ర కమాండ్ నిర్మాణాల కారణంగా విడివిడిగా అంచనా వేస్తుంటారు. కానీ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ అన్ని యూఎస్ వైమానిక విభాగాలను ఒకే సంస్థగా పరిగణిస్తుంది. ఈ ఏకీకృత దృక్కోణం వల్ల అమెరికా, రష్యా మాదిరిగానే ప్రపంచ వైమానిక శక్తిలో భారత్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది... మూడో స్థానంలో నిలిచింది. ఈ సంస్థ అగ్రశ్రేణి వైమానిక దళాల ర్యాంకింగ్‌లను విడుదల చేసినప్పటికీ మొత్తం 103 దేశాల పూర్తి జాబితా, వాటి స్థానాలు ప్రజలకు అందుబాటులో లేవు.
1. యునైటెడ్ స్టేట్స్
2. రష్యా
3. భారత్
4. చైనా
5. జపాన్
6. ఇజ్రాయెల్
7. ఫ్రాన్స్
8. యునైటెడ్ కింగ్‌డమ్
వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ర్యాకింగ్స్ లో పాకిస్థాన్ వైమానిక దళం ర్యాంక్ ఖచ్చితంగా ఎంతో తెలియదు. కానీ ఇది టాప్ 10 లో మాత్రం అస్సలు ఉండబోదు.. ఎందుకంటే దాని టీవీఆర్ 46.3 మాత్రమే. కాబట్టి చివర్లో ఎక్కడో పాక్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్ ఉండే అవకాశాలున్నాయి. ఈ ర్యాంకింగ్స్ ను చూసినతర్వాత భారతీయులు అమెరికా, రష్యాలతో పోటీపడుతున్న భారత్ కు పాకిస్థాన్ ఓ లెక్కా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.