
Karnataka : కర్ణాటక రాజకీయాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పేరు మారుమోగుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే... ఇలా కర్ణాటకలో కూడా జరిగాయి. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తనయుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్దరామయ్యకు లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. స్వయంగా మంత్రి హిందుత్వాన్ని వ్యతిరేకించేలా వ్యవహరించడం దారుణమని బిజెపి మండిపడుతోంది.
ఆర్ఎస్ఎస్ పై రాసిన లేఖ వివాదాస్పదం అవుతున్నా మంత్రి ప్రియాంక్ ఖర్గే వెనక్కితగ్గడంలేదు... తాజాగా ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ ఈ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఖర్గే హెచ్చరించారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని... ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే సస్పెండ్ చేస్తామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే గట్టిగా ప్రభుత్వాన్ని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సివిల్ సర్వీస్ రూల్స్ అమల్లో ఉన్నాయని ఉద్యోగులు గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని స్పష్టమైన నిబంధన ఉందన్నారు. అయినా కూడా కొందరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. తన శాఖలో కూడా కొందరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిసిందని ప్రియాంక్ ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ అధికారుల గురించి ఇప్పటికే ఉన్నతాధికారులను నివేదిక కోరినట్లు ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఇది అందగానే సదరు ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో ప్రస్తావించానని… ముఖ్యమంత్రి అనుమతితో ఉద్యోగులకు చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ సంస్థ కార్యకలాపాలను నిషేధించాలన్న తన డిమాండ్ పై మరోసారి ఖర్గే మాట్లాడారు. ఒక్క ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు ఇలాంటి సంస్థలన్నింటిపై చర్యలు తీసుకోవాలని తాను కోరుతున్నానని అన్నారు. ఇలాంటి సంస్థల తమ కార్యక్రమాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటున్నాయని... వారు ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యకలాపాలపై ఆంక్షల విధిస్తూ గతంలో కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఖర్గే గుర్తుచేశారు. 2012లో జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాఠశాలల్లో మతపరమైన సంస్ధల కార్యకలాపాలపై నిషేధం విదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని గుర్తుచేశారు. వీటిని పాటించకపోవడం వల్లే ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ లాంటి సంస్ధల ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయని అన్నారు.
గతంలో సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించలేదని కొందరు అంటున్నారు... ఆరోజు నిషేధం విషయంలో వెనక్కితగ్గడం సరైంది కాదనే ఇప్పుడు మేము అంటున్నామంటూ తన మాటలను ప్రియాంక్ ఖర్గే సమర్థించుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు విరాళాలు సేకరించడంపై ఖర్గే హెచ్చరించారు. గురుపూర్ణిమ సందర్భంగా పీడీఓల నుంచి ₹2 వేల వరకు డబ్బులు తీసుకున్నారన్నారు. మీరు మీ వ్యక్తిగత డబ్బును ఎవరికైనా విరాళంగా ఇవ్వండి…కానీ ప్రభుత్వ డబ్బును ఇవ్వకండి అని సూచించారు. ప్రభుత్వ అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని మంత్రి స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు.
హిందుత్వం గురించి అడిగిన ప్రశ్నకు ప్రియాంక్ ఖర్గే సమాధానమిస్తూ… 'హిందుత్వాన్ని ఎవరు తెచ్చారు? సావర్కర్ కదా హిందుత్వాన్ని తెచ్చింది? వీళ్లు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హిందుత్వ వాదాన్ని తెచ్చారు'' అని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు.