మనం బతకడానికి నీళ్లు అవసరం కాదు.. అత్యవసరం. ఫుడ్ లేకుండా ఒక 10 రోజులైనా బతకొచ్చు కానీ నీళ్లు లేకుండా మాత్రం జీవించలేం. నీళ్లు లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం. కానీ భూమిపై ఉన్న నీళ్లలో కేవలం 2.5% మాత్రమే తాగేనీరు. అందుకే నీటి విలువను లోకానికి తెలియజేయడానికి ప్రతి సంవత్సరం మార్చి 22 న ప్రపంచ నీటి దినోత్సవం జరుపుతారు. మనకు నీళ్లు అమృతం లాగే. ఎందుకంటే ఇవి లేకుండా మనం బతకలేం. కానీ కొన్ని కొన్ని సార్లు ఈ నీరే మనకు ప్రాణాంతకంగా మారుతాయి.
నిజానికి నీటి ద్వారా కూడా ఎన్నో రోగాలు వ్యాపిస్తాయి. ఇలాంటి వ్యాధులు చాలా డేంజర్ కూడా. వీటిని నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అంటారు. వీటివల్ల లేనిపోని రోగాలు కూడా వస్తాయి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్బంగా కలుషితమైన నీటిని తాగడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
typhoid
టైఫాయిడ్
టైఫాయిడ్ నీళ్ల వల్లే వస్తుంది. ఇదొక సాధారణ వర్షాకాల వ్యాధి. కానీ కొన్ని కొన్ని సార్లు ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. టైఫాయిడ్ కలుషితమైన నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. విపరీతమైన జ్వరం, బలహీనత, కడుపు నొప్పి టైఫాయిడ్ వ్యాధి లక్షణాలు.
కలరా
కలరా డేంజర్ వ్యాధి. ఇది కలుషిత నీళ్లు, కలుషితమైన ఆహారంలో ఉండే బ్యాక్టీరియా వల్ల కలరా వస్తుంది. కలుషితమైన నీటిని తాగినా, కలుషితమైన ఫుడ్ ను తిన్నా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వల్ల విరేచనాలు, వాంతులు అవుతాయి. అలాగే కడుపు తిమ్మిరి వంటి ప్రమాదకరమైన లక్షణాలు కూడా కలుగుతాయి. ఈ వ్యాధి సోకినప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి.
అమీబిక్ విరేచనాలు
అమీబిక్ విరేచనాలు కూడా నీటి ద్వారా వ్యాపించే వ్యాధి. నీటితో పాటుగా కలుషితమైన ఆహారం లేదా మలం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఇది ప్రేగులను ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ వ్యాధి వల్ల రక్తం, శ్లేష్మంతో విపరీతమైన కడుపు తిమ్మిరి, విరేచనాలు అవుతాయి. జ్వరం కూడా వస్తుంది.
Image: Getty Images
హెపటైటిస్ ఎ
హెపటైటిస్ ఎ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ఇది కాలేయాన్ని తాత్కాలికంగా పెంచుతుంది. పచ్చ కామెర్లు, అలసట, కడుపు నొప్పి ఈ వ్యాధి లక్షణాలు.
షిగెల్లోసిస్
షిగెల్లోసిస్ అనేది కలుషితమైన నీళ్లు, ఆహారం లేదా మలం ద్వారా వ్యాపించే వ్యాధి. దీనివల్ల విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, మలం లో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ముఖ్యంగా కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా వస్తుంది. అలాగే అదే చేతిని నోటిలో ఉంచడం వల్ల కూడా వ్యాపిస్తుంది. దీనిబారిన పిల్లలే ఎక్కువగా పడతారు.