సరిగా నిద్రపోకపోతే కూడా బరువు పెరుగుతారా?

First Published Sep 24, 2022, 9:47 AM IST

నిద్రలేకపోతే కూడా బరువు పెరుగుతారన్న ముచ్చట కాస్త వింతగా అనిపించినా.. ఇది ముమ్మాటికీ నిజమంటున్నారు నిపుణులు. అంతేకాదు జీవక్రియ రుగ్మతలు, ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక రుగ్మతలకు దారితీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

no sleep

మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రతోనే బాడీ శక్తివంతంగా తయారవుతుంది. శరీర పనితీరు కూడా మెరుగుపడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల  వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ వ్యాధులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు మొదలైన ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నిద్ర నేరుగా బరువు తగ్గడానికి సంబంధించిందన్న ముచ్చట మీకు తెలుసా? 

కంటినిండా నిద్రలేకపోవడం, పేలవమైన నిద్ర నాణ్యత ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బరువు పెరగడం, జీవక్రియ రుగ్మతలు, ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులకు ఇది దారీతీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వయోజనులు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలైనా నిద్రపోవాలని వెల్లడిస్తున్నారు. ఈ నిద్రతోనే వీరు శక్తివంతంగా మారుతారు. దీనివల్ల బరువును తగ్గించే ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇది మీకు సహాయపడుతుంది. ముఖ్యంగా రాత్రిళ్లు త్వరగా నిద్రపోవడం వల్ల రాత్రిళ్లు లేట్ గా జంక్ ఫుడ్ ను తినే అవకాశాలు తగ్గుతాయి. అయితే కొంతమంది పగటిపూట నిద్రపోతుంటారు. దీనివల్ల అలసట తగ్గినప్పటికీ.. రాత్రిళ్లు నిద్ర ఉండదు. దీనివల్ల వ్యాయామం మిస్ అవుతుంది. 
 

పెద్దలు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల.. వారిలో ఆకలి కోరికలు బాగా పెరిగిపోతాయి. ఇలాంటి వారు కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తింటారు. దీనికి తోడు నిద్రలేకపోవడం వల్ల శరీరం బాగా అలసిపోతుంది. ఇది శారీరక శ్రమను తగ్గిస్తుంది. దీంతో మీరు వేగంగా బరువు పెరుగుతారు. 

కార్టిసాల్ లేదా స్ట్రెస్ హార్మోన్ నిద్రపోకపోతే బాగా ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా బరువు పెరిగేందుకు దారితీస్తుంది. ఉదయం లేవడం, రాత్రి నిద్రపోవడం వంటి మన శరీరం సహజ సామర్థ్యంలో కార్టిసాల్ పాత్ర పోషిస్తుంది. ఇది మనం ఉదయం లేచే ముందు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పగటిపూట నుంచి ఇది క్రమంగా తగ్గుతూ.. రాత్రి వరకు తక్కువ స్థాయిలో ఉంటుంది. 

అయితే మీరు సరిగ్గా నిద్రపోకపోతే.. పగటిపూట కార్టిసాల్ స్థాయిలు అస్సలు తగ్గవు. కార్టిసాల్ స్థాయిలు ఎక్కువ కాలం అలాగే పెరుగుతూ ఉంటే..శరీరం కొవ్వు , శక్తిని నిల్వ చేయడానికి సంకేతాలస్తుంది. దీంతో మీరు బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలన్నా.. బరువు పెరగకుండా ఉండాలన్నా కంటి నిండా నిద్ర చాలా అవసరం. 
 

పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం  చేయండి. అలాగే ఎలక్ట్రానిక్ గాజ్డెట్స్ ను చూడటం మానుకోండి. వీటి బ్లూ లైట్ మీ కంటిని దెబ్బతీయడే కాకుండా.. నిద్రను కూడా పాడుచేస్తుంది. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత టీ, కాఫీలను తాగడం మానుకోండి. రాత్రి 8 గంటల తర్వాత గ్లాస్ నీళ్లను తాగితే రాత్రుళ్లు హాయిగా నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు. 

click me!