మీ గుండె పదిలంగా ఉండాలంటే.. జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరి...

First Published Oct 12, 2021, 3:04 PM IST

ఆరోగ్య నిపుణులు, అనేక అధ్యయనాల ప్రకారం యువకుల్లో హార్ట్ ఎటాక్ లు పెరగడానికి అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లే కారణం అంటున్నారు. తినే ఆహారాన్ని సరిగ్గా ఎంచుకోవడం, పోషకవిలువలు ఉండేలా చూసుకోవడం.. వల్ల మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

నేటి రోజుల్లో హార్ట్ ఎటాక్ లు పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు సర్వసాధారణమైన రుగ్మతలలో ఒకటి. అంతేకాదు యేటా ప్రపంచవ్యాప్తంగా, మరణాలకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. అయితే వృద్ధుల్లో గుండె సమస్యలు మామూలే కాగా నేటి రోజుల్లో యువకుల్లో ఎక్కువగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతున్నాయి.

ఆరోగ్య నిపుణులు, అనేక అధ్యయనాల ప్రకారం యువకుల్లో హార్ట్ ఎటాక్ లు పెరగడానికి అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లే కారణం అంటున్నారు. తినే ఆహారాన్ని సరిగ్గా ఎంచుకోవడం, పోషకవిలువలు ఉండేలా చూసుకోవడం.. వల్ల మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఇలాంటి వాటికి దూరంగా ఉండడం ఎలాగో చూడండి.. 

గుండె ఆరోగ్యకరమైన పనితీరు కోసం బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా కీలకం. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ రెండింటికీ ప్రత్యేకంగా చెప్పదగిన సంకేతాలు లేనప్పటికీ, చికిత్స చేయకుండా వదిలేయడం దీర్ఘకాలంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. అందుకే ముందస్తు రోగ నిర్ధారణ మరిన్ని సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రక్తపోటును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. రక్త పరీక్ష ద్వారా కొలెస్ట్రాల్‌ స్థాయిల్ని అదుపులో పెట్టుకోవచ్చు. 

శారీరకంగా వ్యాయామం లేకపోవడంవల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఎక్కువసేపు కూర్చోవడం గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులతో ముడిపడి ఉన్నట్లు కనుగొనబడింది. అలాగని ఒక్కసారే ఎక్కువ సేపు వ్యాయామం చేయడం మంచిది కాదు.. మెల్లగా వ్యాయామం చేసే సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. 

ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మానుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్ స్ట్రోక్‌తో సహా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను (HDL) తగ్గించి.. ధమనుల్లో అడ్డుపడుతుంది. దీనివల్ల స్ట్రోక్ కు కారణమవుతుంది. అందుకే గుండెకు ఆరోగ్యాన్ని కలిగించే ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకుంటే చాలు. 

బరువులో తేడాలు కూడా గుండెపోటుకు దారి తీస్తాయి. బరువు తగ్గడం వల్ల మీ శరీరం ఈజీగా ఉంటుంది. చక్కటి ఆకృతిలో కనిపిస్తారు. ఊబకాయం వల్ల వచ్చే గుండె సమస్యలకు దూరంగా ఉండొచ్చు. 

సిగరెట్లు, ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నంచాలి. పొగతాగడం, ఆల్కహాల్ మీ హృదయం మీద ప్రతికూలం ప్రభావాలు చూపిస్తాయి. రక్తపోటును పెంచడమే కాకుండా, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను పెంచుతాయి. 

click me!