`శబరి` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published May 3, 2024, 12:36 AM IST

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `శబరి`. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఆకట్టుకునేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైపోయింది. ఆమె బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ మెప్పిస్తుంది. సినిమాలే కాదు, ఆమె పాత్రలు కూడా అంతే బలంగా ఉంటాయి. వరలక్ష్మి తాజాగా `శబరి` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో వచ్చింది. ఆమె తమిళంలో పలు మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలు చేసింది, కానీ తెలుగులో ఇదే మొదటిసారి. అనిల్‌ కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(మే 3న) విడుదలైంది. `శబరి` చిత్రంతో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? థ్రిల్‌ని పంచిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
సంజన(వరలక్ష్మి శరత్‌ కుమార్‌) సింగిల్‌ మదర్‌. తన భర్త అరవింద్‌ (గణేష్‌ వెంకట్‌రామన్‌) వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో ముంబయి నుంచి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఫ్రెండ్‌ వద్ద ఉంటూ జాబ్‌ ప్రయత్నాలు చేస్తుంది. తన కూతురుని మంచి స్కూల్‌లో జాయిన్‌ చేయించాలనుకుంటుంది. జాబ్‌ కోసం తిరగ్గా అందరు తిరస్కరిస్తారు. ఈ క్రమంలో ఆమె కాలేజ్‌ నాటి ఫ్రెండ్‌ రాహుల్‌(శశాంక్‌) నీ  కలుస్తుంది. అతను ఫేమస్‌ లాయర్‌. అతని సహాయంతో ఓ కార్పొరేట్‌ కంపెనీకి జాబ్‌ కోసం వెళ్లగా, ఆమె క్వాలిఫికేషన్‌కి జాబ్‌ దొరకదు, కానీ అందులోనే జుంబా డాన్స్ ట్రైనింగ్‌ ఇచ్చే ట్రైనర్‌ పోస్ట్ ఖాళీ ఉందని తెలిసి రిక్వెస్ట్ చేసి ఆ ఉద్యోగం సంపాదిస్తుంది. ఆ జాబ్‌ చేస్తూ సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్ లో సింగిల్‌గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. ఓ రోజు  అరవింద్‌ ఉన్న అద్దె ఇంటికి వెళ్లి హోనర్‌ని కలుస్తుంది సంజన. తన కోసం సూర్య(మైమ్‌ గోపీ) అనే క్రిమినల్‌ వచ్చాడని, తాను ఎక్కడుంటుందో చెప్పాలని, మీ వద్ద తన కూతురు ఉందని బెదిరించినట్టు చెబుతుంది. దీంతో ఆ రోజు నుంచి ఆ క్రిమినల్‌ తనని వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. అతన్నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. రెండు సార్లు ఇలానే జరుగుతుంది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేట్‌ చేయగా, అతను చనిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు తన భర్త అరవింద్‌.. కూతురిని తనకు ఇవ్వమని ఫోర్స్ చేస్తాడు. కూతురు కోసం కోర్టు మెట్లు ఎక్కుతాడు. కానీ కోర్ట్ సంజనాకి అనుకూలంగానే తీర్పు ఇస్తుంది. మరి కూతురు కోసం అరవింద్‌ ఏం చేశాడు? అరవింద్‌ని సంజన ఎందుకు వదిలేసింది?  సంజనాని వెంబడిస్తున్న సూర్య ఎవరు? అతనికి రియాకి ఉన్న సంబంధం ఏంటి? కూతురిని కాపాడుకోవడం కోసం సంజన ఏం చేసిందనేది మిగిలిన కథ. 
 

విశ్లేషణః
వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటిస్తుందంటే ఆ సినిమాలో విషయం ఉన్నట్టే లెక్క. ఇప్పటి వరకు ఆమె తెలుగులో చేసిన సినిమాలన్నింటిలోనూ ఇదే ప్రూవ్‌ అయ్యింది. ఆల్మోస్ట్ చాలా వరకు ఆయా సినిమాలు విజయాలు సాధించాయి. ఒకటి రెండు తప్ప మాగ్జిమమ్‌ హిట్లు ఉన్నాయి. అలాంటిది ఆమె లేడీ ఓరియెంటెడ్‌ సినిమా చేస్తుందంటే, ఆమెనే సినిమాని లీడ్‌ చేస్తుందంటే ఆ సినిమాలో కంటెంట్‌ బాగా ఉన్నట్టే లెక్క. అయితే `శబరి` సినిమాలోనూ కంటెంట్‌ ఉంటుంది. కానీ దర్శకుడు దాన్ని డీల్‌ చేయడంలో కొంత వరకు తడబాటు కనిపిస్తుంది. ఈ మూవీని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీసుకెళ్లాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాల్లో ఆ థ్రిల్‌ ఎలిమెంట్లని బాగా రాసుకుని, రెండు మూడు ట్విస్ట్ లు ఉంటే, అవి పేలితే సినిమా హిట్టే. `శబరి` విషయంలోనూ అదే ఫార్ములాని వర్కౌట్‌ చేశారు. అదిరిపోయే ట్విస్ట్ లు రెండు మూడు పెట్టి ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసే ప్రయత్నం చేశారు. 
 

సినిమా ఫస్టాఫ్‌లో కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి పాత్రలను పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ టైమ్‌ తీసుకున్నట్టు ఉంటుంది. సంజన ఎందుకు సింగిల్‌గా ఉంది, అరవింద్‌ మ్యాటర్‌ వచ్చినప్పుడు ఎందుకు ఫైర్‌ అవుతూ ఆ విషయం తన వద్ద మాట్లాడవద్దు అని చెప్పడం వంటి అంశాలు సస్పెన్స్ ని క్రియేట్‌ చేశాయి. ఏదో సస్పెన్స్ రన్‌ అవుతుందనే ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. ఆ తర్వాత జాబ్‌ కోసం తిరిగేసన్నివేశాలు, దానికి టైమ్‌ ఎక్కువగా తీసుకోవడం కథ డైవర్ట్ గా మారింది. కొంత బోర్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. రొటీన్‌ అనిపిస్తుంది. కానీ విలన్‌ సూర్య పాత్ర ఎంట్రీతో సస్పెన్స్ జనరేట్‌ అవుతూ మరింతగా ఎంగేజ్‌ చేస్తుంటుంది. సంజనాని సూర్య పాత్ర వెంబడించే సన్నివేశాలు ఉత్కంఠకి గురిచేస్తుంటాయి. పైగా ఫారెస్ట్ లో తీసుకున్న ఇంట్లోని కొంత హర్రర్‌ ఎలిమెంట్‌ కూడా భయానికి గురి చేస్తుంది. మరోవైపు సెకండాఫ్‌లో ప్రారంభంలో సాగదీతగా ఉంటుంది. సంజనా గతానికి సంబంధించిన సీన్లు బోర్‌ తెప్పిస్తాయి. మరోవైపు తన పాపని దక్కించుకునేందుకు ఆమె పడేబాధ హత్తుకుంటుంది. ఆసుపత్రిలో సీన్‌, కోర్ట్ సీన్లు రొటీన్‌గా ఉంటాయి. టైమ్‌ పాస్‌ చేసినట్టుగా ఉంటాయి. సంజనాకి మళ్లీ సూర్య పాత్ర కనిపించడం వెంబడించడం వంటి సీన్లు ఉత్కంఠకి గురి చేస్తూ థ్రిల్‌ చేస్తుంటాయి. దీనికితోడు సూర్య పాత్రలోని ట్విస్ట్, అలాగే అరవింద్‌ పాత్రలోని ట్విస్ట్ లు మాత్రం అదిరిపోయాయి. 
 

అయితే సినిమా కాన్సెప్ట్ బాగుంది. కానీ దాన్ని తీయడంలో దర్శకుడు పొరపాట్లు చేశారు. సినిమాలో చాలా లాజిక్‌లు లేవు. విడాకులు తీసుకోని భార్యాభర్తలు కూతురు కోసం కోర్ట్ మెట్లు ఎక్కడం కన్విన్సింగ్‌గా లేదు. సూర్య ప్లాష్‌ బ్యాక్‌, అరవింద్‌ రిలేషన్‌కి సంబంధించి సీన్లు కన్విన్సింగ్‌గా లేదు. సినిమా కథకి అనవసరమని చెప్పొచ్చు. సినిమా సస్పెన్స్ తో ప్రారంభమవుతుంది. థ్రిల్లర్‌గా మారుతుంది. కాసేపు హర్రర్‌ ఎలిమెంట్లు మెరిశాయి. మళ్లీ ఆ తర్వాత థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ఎదురవుతుంది. దీనికితోడు ట్విస్ట్ లు సినిమాపై ఎంగేజ్‌ చేస్తుంది. సెకండాఫ్‌ ప్రారంభంలో కాస్త సినిమా గ్రాఫ్‌ తగ్గినా, ట్విస్ట్ రివీల్‌ కావడంతో మూవీ థ్రిల్‌కి గురి చేస్తుంది. స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు కేర్ తీసుకోవాల్సింది. లాజిక్‌ పై దృష్టి పెట్టాల్సింది. కథని వెనక్కి ముందుకు చూపిస్తూ, కలలను మధ్యలో జోడిస్తూ కన్‌ ఫ్యూజ్‌ చేసినట్టుగా మారింది.  దర్శకుడు ఆ క్లారిటీ మెయింటేన్‌ చేస్తూ స్క్రీన్‌ ప్లే బాగా రాసుకుంటే, దాన్ని అంతే బాగా ఎంగేజింగ్‌ తెరకెక్కించి ఉంటే సినిమా మరింతగా ఆకట్టుకునేది. 
 

నటీనటులుః
సంజనా పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ బాగా చేసింది. పాత్రలో జీవించి మెప్పించింది. సింగిల్‌ మదర్‌గా, కూతురుని కాపాడటం కోసం పోరాడే మహిళగా విభిన్నమైన, విలక్షణమైన పాత్రలో నటించి మెప్పించింది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది.  అరవింద్‌ పాత్రలో గణేష్‌ వెంకట్‌రామన్‌ బాగా చేశారు. పాజిటివ్‌, నెగటివ్‌ పాత్రల్లో అదరగొట్టాడు. విలన్‌ పాత్రలో మైమ్‌ గోపీ మరోసారి ఆకట్టుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ రియాగా బేబీ నివేక్ష అదరగొట్టింది. లాయర్‌గా శశాంక్‌ మెప్పించాడు. మరోవైపు ఏసీపీగా మధుసూధన్‌ ఆకట్టుకున్నాడు, రాజా శ్రీ, భద్రం, ఆశ్రిత, ఇలా మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. కాకపోతే యాక్టింగ్‌ పరంగా కొన్ని సీన్లు తేలిపోయాయి. 
 

టెక్నీకల్‌గాః
సినిమాకి కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా చాలా బాగా తీశారు. మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉంది. గోపీ సుందర్‌ తనదైన సంగీతంతో సినిమాకి ప్లస్‌ అయ్యారు. బీజీఎం మరింత ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్‌ లోపాలు చాలా ఉన్నాయి. ఆ విషయంలో కేర్‌ తీసుకోవాల్సింది. ఇక దర్శకుడు అనిల్‌ కాట్జ్ స్క్రీన్‌ ప్లే రాసుకోవడంలో క్లారిటీ లేదు. డైలాగ్‌లు కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి. చాలా లాజిక్స్ వదిలేశారు. థ్రిల్‌ ఎలిమెంట్లని బలంగా రాసుకోవాల్సింది. ట్విస్ట్ లు బాగున్నా దానికి తగ్గ సీన్లు లేకపోవడంతో ఆ కిక్‌ తగ్గిపోయింది. ఓవరాల్‌గా విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ని అందించారని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీపడకుండా నిర్మించారు. 
 

ఫైనల్‌గాః `శబరి` విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్‌. థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారికి నచ్చే మూవీ అవుతుంది.

రేటింగ్‌ః 2.5/5

నటీనటులు:
వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు.

సాంకేతిక బృందం:
రచనా సహకారం: సన్నీ నాగబాబు,
ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, 
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, 
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, 
సంగీతం: గోపి సుందర్, 
సమర్పణ: మహర్షి కూండ్ల, 
ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, 
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అనిల్ కాట్జ్.
 

click me!