ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫ్రిజ్ ను వాడుతున్నారు. ఫ్రిజ్ ఆహారాన్ని తాజాగా, సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వీటిని ఎండాకాలంలో బాగా వాడుతుంటారు. కూరగాయలను నిల్వ చేయడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్రిజ్ లు కూడా పాడైపోతుంటాయి. ఈ విషయం మనకు అంత తొందరగా తెలియకపోవచ్చు. మీ ఫ్రిజ్ బాగానే పనిచేస్తుందని, ఎక్కువ రోజులు ఉంటుందని నిర్ధారించుకోవడానికి మీరు క్రమం తప్పకుండా వాటిని చెక్ చేస్తుండటం అవసరం. కాయిల్స్ ను శుభ్రంగా ఉంచడం నుంచి సరైన ఉష్ణోగ్రతను సెట్ చేయడం వరకు, మీ ఫ్రిజ్ జీవితకాలాన్ని పొడిగించడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కాయిల్స్ శుభ్రంగా ఉంచండి
ఫ్రిజ్ వెనుక లేదా కింద ఉన్న కండెన్సర్ కాయిల్స్ చల్లబరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలక్రమేణా ఈ కాయిల్స్ దుమ్ము, ధూళితో కప్పబడతాయి. దీనివల్ల ఫ్రిజ్ చల్లబడటం కష్టంగా మారుతుంది. అందుకే వాక్యూమ్ క్లీనర్ లేదా కాయిల్ బ్రష్ తో ప్రతి ఆరు నెలలకోసారి కాయిల్స్ ను క్లీన్ చేయండి. దీనివల్ల మీ ఫ్రిజ్ సామర్థ్యం మెరుగుపడుతుంది. అలాగే ఫ్రిజ్ వేడెక్కదు.
డోర్ సీల్స్ చెక్ చేయండి
డోర్ సీల్స్, లేదా గ్యాస్కెట్లు ఫ్రిజ్ లోపల చల్లని గాలి ఉండేలా చూస్తాయి. ఇవి వదులుగా లేదా పగుళ్లు ఉంటే మీ ఫ్రిజ్ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. ఇది మీ ఫ్రిజ్ లైఫ్ టైం ను తగ్గిస్తుంది. అందుకే సీల్స్ ను రెగ్యులర్ గా చెక్ చేయండి. అలాగే బేకింగ్ సోడా, నీళ్లతో వాటిని క్లీన్ చేయండి. అవి దెబ్బతిన్నట్టైతే వాటిని వెంటనే మార్చండి.
సరైన ఉష్ణోగ్రతను సెట్ చేయండి
శక్తి సామర్థ్యం, ఆహార భద్రత రెండింటికీ మీ ఫ్రిజ్ ను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడం చాలా అవసరం. ఫ్రిజ్ కంపార్ట్ మెంట్ కొరకు అనువైన ఉష్ణోగ్రత 37°F (3°C), 40°F (4°C) మధ్య ఉంచండి. అయితే ఫ్రీజర్ 0°F (-18°C) వద్దనే ఉండాలి. ఉష్ణోగ్రతను చాలా తక్కువగా సెట్ చేయడం మానుకోండి. ఎందుకంటే ఇది కంప్రెషర్ పై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది.
రిఫ్రిజిరేటర్ ను ఓవర్లోడ్ చేయొద్దు
మీ ఫ్రిజ్ ఓవర్లోడ్ చేయడం వల్ల గాలి వెంట్లను నిరోధించొచ్చు. అలాగే చల్లని గాలి ప్రసరణను తగ్గిస్తుంది. ఇది ఫ్రిజ్ లో పెట్టిన వాటి సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడం కష్టతరం చేస్తుంది. ఆహార పదార్థాల చుట్టూ గాలి స్వేచ్ఛగా ప్రవహించడానికి తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి.
డీఫ్రాస్ట్
మీ ఫ్రిజ్ లో ఆటోమేటిక్ డీఫ్రాస్ట్ ఫంక్షన్ లేకపోతే.. ఫ్రీజర్ ను క్రమానుగతంగా డీఫ్రాస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఐస్ బిల్డప్ మీ ఫ్రిజ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే కరెంట్ వాడకం కూడా పెరుగుతుంది. ఐస్ నిర్మాణం పావు అంగుళం మందానికి చేరుకున్నప్పుడు ఫ్రీజర్ ను డీఫ్రాస్ట్ చేయండి. రిఫ్రిజిరేటర్ ను ఆఫ్ చేయండి. దానిలోని వస్తువులన్నింటినీ బయటపెట్టండి. అలాగే మంచు సహజంగా కరిగిపోనివ్వండి. లేదా ప్రక్రియను పెంచడానికి చేయడానికి వెచ్చని నీటిని ఉపయోగించండి.