కారంగా ఉండే వంటకాలను తింటే ఇన్ని లాభాలున్నాయా?

First Published Jan 10, 2023, 2:58 PM IST

కారంగా ఉండే ఆహారాలు మనకు మంచివన్న సంగతి మీకు తెలుసా? మీ ఆహారంలో మసాలాను జోడించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. 
 

spicy food

భారతదేశం 'మసాలా' ఆహారాలకు ప్రసిద్ది చెందింది. కారంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినే వ్యక్తులు చాలా మందే ఉన్నారు. నిజానికి ఫుడ్ కారంగా లేకపోతే మొత్తమే తినని వారు కూడా ఉన్నారు. కారంగా ఉండటానికి సాధారణంగా పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలను వాడుతుంటారు. ఈ మిరపకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ.. కావు తెలుసా.. 

పచ్చి లేదా ఎండు మిర్చిని దాదాపుగా ప్రతి ఒక్క కూరలో వేస్తుంటారు. వీటి రుచి కారంగా ఉన్నప్పటికీ వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిరపకాయల్లో ఫైబర్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, పొటాషియం , మాంగనీస్ కూడా ఉన్నాయి. మిరపకాయలతో 'మసాలా' ఆహారాలను చేసుకుని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

బరువు తగ్గుతారు

బరువు తగ్గాలనుకునే వారికి మిరపకాయలు బాగా సహాయపడతాయి. ఎందుకంటే మిరపకాయలలో ఎటువంటి కేలరీలు ఉండవు. భోజనం తిన్న మూడు గంటల్లోనే జీవక్రియను వేగవంతం చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో కారంగా ఉండే వంటకాలను చేర్చొచ్చు.
 

గుండెకు మంచిది

మీ ఆహారంలో పచ్చి మిరపకాయలను క్రమం తప్పకుండా చేర్చడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా అంటే ఇది మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

పచ్చి మిరపకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పచ్చి మిరపకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. 
 

చర్మ ఇన్ఫెక్షన్లు

మిరపకాయలల్లో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది. పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.

Spicy

మెరుగైన మానసిక స్థితి

కారంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మన మానసిక స్థితి మారుతుంది. అంతేకాదు ఈ ఫుడ్ మనల్ని సంతోషంగా ఉంచుతుంది. ఇవి హ్యాపీ హార్మోన్లను రిలీజ్ చేయడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒత్తిడి, నిరాశ నుంచి ఉపశమనం పొందుతారు. 

click me!