వ్యాయామానికి ముందు, తరువాత... ఈ చిన్న జాగ్రత్తలతో మెరిసే చర్మం మీ సొంతం...

First Published Sep 11, 2021, 12:35 PM IST

మీ చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి వర్కవుట్స్ కి ముందు, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలిస్తే చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా మెరిసి పోతుంది. 

వ్యాయామం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతతకూ పనికివస్తుంది. మీ మూడ్ ను రిఫ్రెష్ చేస్తుంది. చర్మాన్ని కూడా మెరిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెరిగింది. ఇది మంచిదే.. అయితే చర్మ సంరక్షణ విషయంలో రోజువారీ తీసుకోవాల్సి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? 

చర్మసంరక్షణ విషయంలో శ్రద్ధ పెట్టకపోతే మీరు జిమ్ లు, పార్కుల్లో రన్నింగులు, యోగాలు చేసి కూడా పెద్దగా ఫలితాలు ఉండవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే చెమట పట్టడం అనేది ఆరోగ్యవంతమైన చర్మానికి సూచిక. అయితే ఇది మీరు క్రమం తప్పని చర్మ సంరక్షణ జాగ్రత్తలు తీసుకుంటేనే సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించడం, చర్మం నిస్తేజంగా, ఇన్ఫెక్షియస్ చర్మం వరకు దెబ్బతీస్తుంది.

మీ చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి వర్కవుట్స్ కి ముందు, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలిస్తే చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా మెరిసి పోతుంది. 

వర్కవుట్స్ చేసేముందు మేకప్ ను తీసేయాలి. మేకప్ వల్ల చర్మ రంధ్రాలు, చెమట గ్రంథులు మూసుకుపోతాయి. దీనివల్ల చర్మానికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అందుకే వ్యాయామం చేసేముందు మేకప్ ఉంటే తప్పనిసరిగా తీసేయాలి. 

వర్కవుట్స్ చేసేముందు తేలికపాటి ఫేస్ వాష్ తో మొహాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి. 

యాంటిపెర్స్పిరెంట్ రోల్-ఆన్‌ను వాడండి. వ్యాయామం చేసేప్పుడు చెమట పట్టడం మామూలు విషయం. అయితే యాంటీపెర్స్పిరెంట్ రోల్-ఆన్ వాడడం వల్ల మీ అండర్ ఆర్మ్స్ లోని చర్మం బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములకు కేంద్రంగా మారకుండా ఉంటుంది. 

అలాగే జుట్టు విరబోసుకుని వర్కవుట్ చేయకూడదు. ఒకవేళ మీ జుట్టు పొట్టిగా ఉన్నా.. పైకి కట్టుకోండి. వ్యాయామానికి ముందు ప్రతిరోజూ తలను శుభ్రం చేసుకోవడం కుదరదు కాబట్టి.. జుట్టుకు వాడిన హెయిర్ ప్రోడక్ట్స్ వల్ల అవి స్వేధరంద్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. నుదుటిమీద గీతలు, మచ్చలు ఏర్పడడానికి కారణమవుతాయి. అందుకే జుట్టును పైకి కట్టుకోవాలి. 

జిమ్ లలో వ్యాయామం చేస్తున్నట్లైతే అక్కడి ఎక్వీప్ మెంట్ వాడేప్పుడు తప్పనిసరిగా డిసిన్షెక్షన్ చేసుకోవాలి.  మీ స్వంత శుభ్రమైన టవల్ ను వాడండి. అలాగే వ్యాయామం చేస్తున్న సమయంలో చేతులతో ముఖాన్ని తాకొద్దు. వ్యాయామం సమయంలో చేతులు మురిగ్గా ఉంటాయి. దీనివల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు ఉద్దేశపూర్వకంగా..  మీ చేతులను మీ ముఖానికి దూరంగా పెట్టాలి.

అలాగే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి. జిమ్ కు వెళ్లేప్పుడు మీ సొంత టవల్ ను తీసుకువెళ్లండి. వీలైనంత వరకు టాయిలెట్లు వాడకుండా ఉండడం మంచిది. 

వ్యాయమం తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వ్యాయామానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో, వ్యాయామం తరువాత కూడా అంతే ముఖ్యం. వ్యాయామం తర్వాత చెమటతో ఉన్న ముఖంతో విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ చర్మంలో బ్యాక్టీరియా ఏర్పడడం మొదలవుతుంది. దీనివల్ల మీ ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, జిడ్డు, చెమటను వదిలించుకోవడానికి చల్లట నీటితో కడుక్కోవాలి. 

అలాగే వ్యాయామంతో తలలోనూ చెమట పడుతుంది. దీనికోసం వ్యాయామం తరువాత తేలికపాటి షాంపూతో స్నానం చేయండి. అయితే రోజూ తలస్నానం చేయడం మంచిది కాదు. ఇది గుర్తుంచుకోవాలి. బ్లో డ్రైయర్‌కు బదులుగా మీ జుట్టును ఆరబెట్టడానికి టవల్ ఉపయోగించండి.

దీంతోపాటు వ్యాయామం తరువాత వెంటనే బట్టలు మార్చుకోవాలి. ఎందుకంటే వ్యాయమం తరువాత చర్మం చెమటను, టాక్సిన్స్ ను విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన టాక్సిన్స్ మామూలగా బట్టలలో చేరతాయి. ఇది చర్మ రంధ్రాలను మూసేస్తాయి. దీనివల్ల శరీరం మీద దద్దుర్లు, మొటిమలకు దారితీస్తుంది. 

అందుకే వ్యాయామం తరువాత వెంటనే స్నానం చేసి శుభ్రమైన, పొడి బట్టలు వేసుకోవాలి. వెంటనే స్నానం చేయడం సాధ్యం కాకపోతే కనీసం బట్టలైనా మార్చుకోవాలి. వర్కవుట్స్ సమయంలో శరీరం నుంచి వేడి విడుదలవుతుంది. అందుకే చర్మాన్ని చల్లబరచాలంటే స్నానం చేయడం మంచి ఉపాయం. 

చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి, సీరం అప్లై చేయండి. ఆ తరువాత చివర్లో చర్మంపై మాయిశ్చరైజర్‌ను కూలింగ్ జెల్‌తో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే రెగ్యులర్ వర్కవుట్స్ తో పాటు.. చర్మ సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి శరీరాకృతితో పాటు.. అందమైన చర్మం మీ సొంతమవుతుంది. 

click me!