కోవిడ్-19 కొత్త వేరియంట్ ప్రమాదకరమైన వ్యాధులను కలిగిస్తుందా?

First Published Dec 29, 2022, 12:08 PM IST

ఒమిక్రాన్  సబ్ వేరియంట్ అయిన బిఎఫ్.7 ఒక అంటువ్యాధి. ఇది ఇతర వేరియంట్ల కంటే ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతుందని  ప్రపంచ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే దీన్ని లైట్ గా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

చైనాతో సహా ప్రపంచలోని ఎన్నో దేశాల్లో ప్రస్తుతం ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎఫ్ .7 వేగంగా వ్యాపిస్తోంది. గుజరాత్, ఒడిసాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వేరియంట్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 స్ట్రెయిన్ చైనాలో మాదిరిగా భారతదేశంపై ఎక్కువ ప్రభావాన్ని చూపనప్పటికీ.. దీని పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.


కోవిడ్ బిఎఫ్.7 తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందా?

బిఎఫ్.7 అనేది ఒమిక్రోన్ వేరియంట్. దీనిని నేషనల్ ఐఎంఎ కోవిడ్ టాస్క్ఫోర్స్ కో-చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ "ఒమిక్రోన్ కు ముని మనుమడు" గా పేర్కొన్నారు. బిఎఫ్.7 వేరియంట్ గతంలో కరోనా సోకిన లేదా టీకాలు తీసుకున్న వ్యక్తులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అంతేకాదు దీనికి రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం ఉంటుందని వెల్లడించారు. అయితే ఇది తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
 

ఓమిక్రాన్ వేరియంట్ ను మొదట సారిగా 2021 నవంబర్ లో దక్షిణాఫ్రికాలో గుర్తించారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇది కేవలం ఒకటిన్నర నెలల్లోనే  ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో బిఎ.1 వెర్షన్ మొదటిసారిగా గుర్తించబడింది. ఆ తర్వాత బిఎ.2 వేరియంట్ 2022 జనవరి-ఫిబ్రవరిలో మూడవ వేవ్ కు కారణమైంది. అప్పటి నుంచి బిఎ.2 వేరియంట్ భారతదేశంలో వ్యాప్తంగా బాగా వ్యాపించింది.  
 


కోవిడ్ బీఎఫ్.7 లక్షణాలు

ఒమిక్రాన్ ఉప వేరియంట్ బిఎఫ్ .7 వేరియంట్ ఒక అంటువ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది ఇతర వేరియంట్ల కంటే ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కీళ్ల నొప్పులు, ఎగువ శరీర నొప్పి, యుఆర్ఐ (ఎగువ శ్వాసకోశ సంక్రమణ) , వెర్టిగో వంటి సమస్యలు పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ రోజు వరకు ఏ అధ్యయనం కూడా ఈ లక్షణాలను కొత్త వేరియంట్ తో ముడిపెట్టలేదు. అందుకే ఇవి బిఎఫ్.7 వల్ల కలిగిన లక్షణాలు అని నిర్ధారించలేము.
 

అయితే దీనివల్ల కలిగే ఈ అత్యంత సాధారణ లక్షణాలను విస్మరించకూడదు. ఒకవేళ మీకు కూడా ఈ లక్షణాలు ఉంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం, సరైన మందులు తీసుకోవడం మంచిది. దీని సాధారణ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గొంతు నొప్పి

ముక్కు కారడం

జ్వరం

కఫంతో లేదా కఫం లేకుండా దగ్గు

తలనొప్పి

గద్గద స్వరం

కండరాల నొప్పి

శరీర నొప్పులు

వాసనలో మార్పు

click me!