
దానిమ్మపండులో ఎన్నో పోషకాలుంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పండును తింటే ఒంట్లో రక్తం పెరగడం నుంచి గుండె ఆరోగ్యంగా ఉండటం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఈ పండును ఖచ్చితంగా తినాలని చెప్తుంటారు.
ముఖ్యంగా ఈ పండు రక్త హీనత సమస్య ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండును తింటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అందుకే ఈ పండును రోజూ ఒకటి తినాలని డాక్టర్లు చెప్తుంటారు. ఇదొక్కటే కాదు ఈ పండు వల్ల బోలెడు లాభాలున్నాయి. అయినా కానీ ఈ పండును కొంతమంది తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బీపీ తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా ఈ పండును తినకపోవడమే మంచిది. ముఖ్యంగా బీపీ తక్కువగా ఉన్నవారు, బీపీ తగ్గడానికి మందులు తీసుకునేవారు దానిమ్మ పండును డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కూడా దానిమ్మ పండును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తిన్నా తక్కువగానే తినాలి. లేదంటే మీ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే గనుక దానిమ్మ పండును తినకపోవడమే మంచిది. అలాగే ఈ సమస్యకు మందులను వాడే వారు కూడా దానిమ్మ పండును తినకూడదు. ఎందుకంటే ఈ పండు లివర్ పనితీరును తగ్గిస్తుంది
డయేరియా, అలెర్జీ ఉన్నవారు దానిమ్మ పండును తినకూడదు. ఎందుకంటే ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఈ ఫైబర్ ఎక్కువైతే అలెర్జీ, డయేరియా వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వీళ్లు దానిమ్మను తినకూడదు.
దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. అయినా కానీ రెండేళ్ల లోపున్న పిల్లలకు దానిమ్మ పండ్లను అస్సలు తినిపించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గర్భిణులకు దానిమ్మ పండు మంచిదే. దీనిని తినొచ్చు. కానీ ఎక్కువ మాత్రం తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పండు జ్యూస్ ను తాగకపోవడమే మంచిదని చెప్తున్నారు.
దానిమ్మ పండులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు వీటిని ఎక్కువగా తినకూడదు. వీళ్లు వారానికి ఒకటి లేదా రెండు మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సర్జరీ చేయించుకునే వాళ్లు దానిమ్మ పండ్లను ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లు సర్జరీ చేయించుకునే రెండు వారాల మందు నుంచే దానిమ్మ పండును తినడం మానేయాలి. ఇకపోతే సర్జరీ అయిన తర్వాత డాక్టర్ ను అడిగిన తర్వాతే ఈ పండును తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.