
ఆంధ్రాలో గోంగూర పచ్చి రొయ్యలతో కూర వండుతారు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇందులో వచ్చే గ్రేవీని కేవలం అన్నంతోనే కాదు రోటి, చపాతీ, దోశ దేనితో తిన్న అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రేవీని ఎలా వండాలో ఇక్కడ ఇచ్చాము రెసిపీ తెలుసుకోండి. గోంగూర పచ్చి రొయ్యల కర్రీ పేరు చెబితేనే ఆంధ్రాలో ఒక్కొక్కరికి నోరూరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇది కేవలం ఆంధ్ర ప్రజలే కాదు, తెలంగాణలో ఉన్న తెలుగు వారికి కూడా ఇది నచ్చే రెసిపీయే. పచ్చి రొయ్యలు గోంగూరతో చేసే ఈ రెసిపీలో ఇగురు ఎక్కువగా వస్తుంది. కాబట్టి వేడి వేడి అన్నంలో ఇగురు కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం గోంగూర పచ్చి రొయ్యలు గ్రేవీ ఎలా ఉండాలో తెలుసుకోండి.
రొయ్యలు అరకిలో పొట్టు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇక నూనె తగినంత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ కలిపి ఒక గుప్పెడు తీసుకోండి. అలాగే జీలకర్ర పావు స్పూను, కరివేపాకులు గుప్పెడు, పచ్చిమిర్చి మూడు, ఉల్లిపాయ ఒకటి, నూనె తగినంత, టమోటోలు రెండు, పసుపు, కారం తగినంత తీసి పక్కన పెట్టుకోండి. ఇక ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక స్పూను తీసుకోండి. నీళ్లు పెద్దగా అవసరం పడవు. కాబట్టి ఒక పావు గ్లాసు పక్కన పెట్టుకోండి. ఇక అసలైన గోంగూర ఆకులను బాగా కడిగి తురిమి ఒక గిన్నెలో వేసుకోండి. ఒక పావు కిలో గోంగూర ఆకులను తీసుకుంటే సరిపోతుంది. అలాగే గరం మసాలా అర స్పూను, ఉప్పు రుచికి సరిపడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెసిపీని వండడానికి సిద్ధంగా ఉండండి.
స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. ఆ నూనెలో రొయ్యలను వేసి వేయించండి. రొయ్యలు వేగుతున్నప్పుడే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేయండి. అవి వాటి నుంచి నీరు దిగిపోయేదాకా వేయించండి. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం నూనె వేయండి. ఆ నూనెలో మసాలా దినుసులు, జీలకర్ర, కరివేపాకులను వేసి వేయించుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా నిలువుగా కోసి వేసి వేయించండి. ఇవి బాగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు మారే వరకు వేయించుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించండి. ఇది బాగా వేగాక టమాటా తరుగును వేసి పైన మూత పెట్టి గుజ్జులా అయ్యేదాకా ఉడికించండి.
టమాటా మెత్తగా ఉడికాక పసుపు, కారం, ధనియాలు పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం నూనె వేసి ఉడికించుకోండి. ఆ తర్వాత గోంగూర ఆకులను వేసి పైన మూత పెట్టి ఉడకించండి. కాసేపటికే గోంగూర ఆకులు మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి. అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసి పైన మూత పెట్టి ఉడికించండి. దింపడానికి పది నిమిషాల ముందు గరం మసాలాను, కరివేపాకులను, పచ్చిమిర్చి తురుమును వేసి బాగా కలపండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ గోంగూర పచ్చి రొయ్యల గ్రేవీ రెడీ అయినట్టే.
ఈ గ్రేవీతో వేడివేడి అన్నాన్ని తిని చూడండి. అద్భుతంగా ఉంటుంది. అలాగే చపాతి, రోటి, దోశ, ఇడ్లీ వంటివి కూడా ఈ గ్రేవీతో తినవచ్చు. ఇందులో పోషకాలు కూడా అధికమే కారం తక్కువగా వేసుకుంటే పిల్లలు కూడా తింటారు. పెద్దలకు మాత్రం ఇది స్పైసీగా తింటేనే టేస్టీగా అనిపిస్తుంది. బగారా రైస్ తో ఈ పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎవరికైనా ఇది ఇస్తే నచ్చేస్తుంది.