
పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పాలను తాగుతున్నారు. పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే మనలో కొంతమంది ఆవు పాలను తాగితే, మరికొంతమంది మాత్రం గేదె పాలను తాగుతుంటారు.
నిజానికి ఈ రెండు రకాల పాలు మంచివే. కానీ వీటిలోని పోషకాలు, టేస్ట్, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యకరమైనవో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మంది ఆవుపాలనే తాగుతుంటారు. అయితే ఈ ఆవు పాలలో ప్రోటీన్లు, కొవ్వుపుష్కలంగా ఉంటాయి. ఈ పాలు సులువుగా జీర్ణం అవుతాయి. అయినా గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలున్నవారు మాత్రం ఆవు పాలను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఈ సమస్యలను పెంచుతాయి. అయితే ఆవు పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. ఈ పాలు కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
గేదె పాలలో ఆవు పాలకంటే ఎక్కువ మొత్తంలో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. అలాగే ఈ పాలు చాలా చిక్కగా ఉంటాయి. అందుకే ఈ పాలు జీర్ణం కావడానికి కొంచెం సమయం పడుతుంది. గేదె పాలలోని ప్రోటీన్లు మనకు శక్తిని ఎక్కువగా ఇస్తాయి. కానీ వీటిలో అవసరానికి మించి ఉన్న కొవ్వు మాత్రం శరీరంలో పేరుకుపోతుంది.
ఒకేదగ్గర కూర్చొనే వారు ఈ పాలను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిలోని ఫ్యాట్ బరువు పెరిగేలా చేస్తుంది. ఈ పాలను శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు తాగితే మంచిది. ఆవు పాల లాగే జీర్ణ సమస్యలు, గ్యాస్ వంటి సమస్యలున్నవారు గేదె పాలను తాగకూడదు. తాగితే సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
- గేదె పాల విషయానికి వస్తే వీటిలో ప్రోటీన్ అవసరానికి మించి ఉంటుంది. కాబట్టి ఈ పాలను తాగితే మూత్రపిండాలపై అదనపు భారం పడుతుంది. ఆవు పాలు ఇలా కాదు. వీటిలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మూత్రపిండాలకు ఎలాంటి హాని చేయవు. కాబట్టి మూత్రపిండాల సమస్య ఉన్నవారు గేదె పాలను కాకుండా ఆవు పాలను తాగాలి.
- ఇకపోతే ఆవు పాలు తొందరగా అరుగుతాయి. కాబట్టి వీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు రావు. కానీ కొన్ని కొన్ని సార్లు గ్యాస్, కడుపు ఉబ్బరం, వంటి సమస్యలకు దారితీస్తాయి. ఇది చాలా రేర్ గా జరుగుతుంది. అదే గేదె పాలు అయితే అరగడానికి కొంత సమయం పడుతుంది. ఈ పాలను పిల్లలు, వృద్ధులు తాగితే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందుకే జీర్ణ సమస్యలు లేనివారే గేదె పాలను తాగాలి.
మొత్తంగా ఈ రెండింటిలో మనకు మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీ శరీర అవసరాలను తెలుసుకుని ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని తాగడం మంచిది. అయితే గేదె పాలలో నీళ్లు కలిపి మరిగించి తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పాలు పలచడి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.