Food: చాలామంది రోజూ ఒకే విధమైన ఆహారం తినడం అలవాటు చేసుకుంటారు. ఉదయం అదే టిఫిన్, మధ్యాహ్నం అదే భోజనం, రాత్రి కూడా దాదాపు అదే మెనూ. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన కడుపులో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. వీటినే “గట్ బ్యాక్టీరియా” అంటారు. ఇవి ఆహారం జీర్ణం కావడంలో, రోగనిరోధక శక్తి పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మంచి బ్యాక్టీరియా బలంగా ఉండాలంటే రకరకాల పోషకాలు అవసరం. ఒకే రకమైన ఆహారం ఎక్కువకాలం తింటే శరీరానికి కావాల్సిన అన్ని రకాల ఫైబర్, పోషకాలు అందవు. దీంతో పేగుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
25
ఒకే ఆహారం తింటే వచ్చే సమస్యలు ఇవే
రోజూ ఒకే మెనూ ఫాలో అవుతూ ఉంటే మొదట్లో పెద్దగా సమస్య కనిపించకపోవచ్చు. కానీ కొంతకాలానికి జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం, కడుపు బరువుగా అనిపించడంతో పాటు కొన్ని ఆహారాలు జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు రావొచ్చు. మన ప్లేట్‌లో పప్పు, అన్నం, కూర ఉన్నాయంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతి ధాన్యం, కూరగాయ, పండులో వేర్వేరు రకాల పోషకాలు ఉంటాయి. అవే పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచుతాయి.
35
పరిశోధనల్లో బయటపడిన నిజాలు
నిపుణుల పరిశోధనల ప్రకారం.. వారంలో రకరకాల మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకునే వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా, బలంగా ఉంటోంది. అంటే కేవలం ఒకే ఆహారం కాకుండా.. వేర్వేరు కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రతిరోజూ ఒకే టైమ్‌కు ఒకే విధమైన ఆహారం తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బరువు నియంత్రణ సులభం అవడం, ఆహారపు అలవాట్లు క్రమబద్ధంగా ఉండడం, శరీరానికి సమయానికి ఆహారం అందడం వంటి లాభాలుంటాయి. కానీ నెలలు, సంవత్సరాల పాటు ఎలాంటి మార్పులు లేకుండా అదే ఆహారం కొనసాగిస్తే సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది.
55
ఆహారంలో చిన్న మార్పులు చేస్తే చాలు
నిపుణులు చెబుతున్నదేమిటంటే.. ఒక్కసారిగా మొత్తం డైట్ మార్చాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు చేసినా సరిపోతుంది. ఉదాహరణకు.. తెల్ల బియ్యం బదులు అప్పుడప్పుడు చిరుధాన్యాలు తినడం, సీజన్‌కు తగ్గ కూరగాయలు మార్చడం, రకరకాల పప్పులు తీసుకోవడం, పెరుగు, మజ్జిగను ఆహారంలో చేర్చడం, రోజూ వేర్వేరు పండ్లు తినడం వంటి అలవాట్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కడుపు నింపుకోవడం సరిపోదు. శరీరానికి అవసరమైన రకరకాల పోషకాలు అందేలా ఆహారంలో వైవిధ్యం ఉండటం చాలా ముఖ్యం.