
అరటి పండ్లు ఏ సీజన్ లో అయినా మార్కెట్ లో ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ పండ్ల ధర తక్కువే అయినా ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. ఈ పండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తినొచ్చు. చాలా మందికి రోజుకు ఒక అరటిపండును తినే అలవాటు ఉంటుంది. కానీ మీరు గనుక రోజుకు రెండు అరటిపండ్లను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు.
మంచి శక్తి వనరు
అరటిపండ్లు మంచి శక్తి వనరులు. వీటిలో నేచురల్ షుగర్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల అరటిపండును తిన్న వెంటనే శక్తి అందుతుంది. ఇది మన శరీరాన్ని చాలా సేపటి వరకు ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలసటను తగ్గిస్తుంది. అందుకే జిమ్ కు వెళ్లేవారు, అథ్లెట్లు వ్యాయామం చేయడానికి ముందు, ఆ తర్వాత అరటిపండ్లను తింటుంటారు.
బలమైన జీర్ణవ్యవస్థ
అరటిపండ్లు జీర్ణక్రియకు కూడా చాలా మంచివి. వీటిలోని ఫైబర్ కంటెంట్ ఆహారం సులువుగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. దీనిలో ప్రీబయోటిక్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి మలబద్దకం సమస్యను తగ్గించేందుకు సహాయపడుతుంది.
అరటిపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది హార్ట్ ఎటాక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు రోజుకు రెండు అరటిపండ్లను తింటే శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పొటాషియం అందుతుంది.
మానసిక స్థితి మెరుగు
ఈ రోజుల్లో ఒత్తిడి సర్వ సాధారణ సమస్య అయిపోయింది. అయితే అరటిపండ్లు స్ట్రెస్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ పండ్లలో ఉంటే ట్రిప్టోఫాన్ శరీరంలో ఫీల్ గుడ్ అనే సెరోటినిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయడానికి అవసరం. ఇది మీ మానసకి స్థితిని మెరుగుపరిచి, స్ట్రెస్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోతారు.
శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. అయితే అరటిపండల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ను పెంచేందుకు సహాయపడుతుంది. ఈ పండులోని విటమిన్ బి6 హిమోగ్లోబిన్ తయారీకి అవసరం.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
బరువు తగ్గాలనుకునే వారికి కూడా అరటిపండ్లు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లను తింటే కడుపు తొందరగా నిండుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీరు ఉదయం ఆరోగ్యాన్ని పాడు చేసే అల్పాహారాలను తినకుండా ఉంటారు. అలాగే అతిగా తినాలనే కోరికలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా అరటిపండ్లు మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
అరటిపండులో విటమిన్ B6, విటమిన్ C వంటి ముఖ్యమైన విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి మీరు రోజుకు రెండు అరటిపండ్లను తినడం వల్ల సీజనల్ ఫ్లూ, జలుబు వంటి వ్యాధులకు తక్కువగా గురవుతారు.
అరటి పండులో విటమిన్ C, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. అలాగే ముడతలను తగ్గిస్తాయి. అరటిపండ్లను తినడం వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది. అలాగే అరటిలో ఉండే బయోటిన్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
గర్భిణీ స్త్రీలకు మంచిది
గర్భిణీ స్త్రీలకు కూడా అరటిపండ్లు చాలా మంచివి. ఈ పండ్లలో విటమిన్ బి6, పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గర్భిణులకు చాలా అవసరం. ఇవి గర్భిణులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ప్రెగ్నెన్సీ టైం ఉదయం వాంతులు అయ్యే వారికి కూడా ఇది సహాయపడుతుంది. దీన్ని తింటే వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుంది.