'ఆదిపురుష్'కి ఫస్ట్ డే నెగిటివ్ టాక్, ప్రభాస్ కి తడిబట్ట వేసుకుని పడుకోమని చెప్పా.. దిల్ రాజు కామెంట్స్ 

First Published Oct 7, 2022, 6:47 AM IST

ఆదిపురుష్ చిత్ర యూనిట్ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు రంగంలోకి దిగింది. గురువారం రోజు ఏఎంబి సినిమాస్ లో 3డి టీజర్ రిలీజ్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడు. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

టీజర్ లో ఓం రౌత్ పాత్రలని చూపించిన విధానం అసలు రుచించడం లేదు. మన ఊహల్లో ఉండే రామాయణానికి పూర్తి భిన్నంగా ఉండడంతో అంత దుమ్మెత్తి పోస్తున్నారు.  రావణాసురుడి పాత్రపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. టీజర్ లో చూపిన ఏ షాట్ కూడా ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దీనితో ఆదిపురుష్ చిత్ర యూనిట్ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు రంగంలోకి దిగింది. 

గురువారం రోజు ఏఎంబి సినిమాస్ లో 3డి టీజర్ రిలీజ్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు అతిథిగా హాజరయ్యారు. ఆదిపురుష్ 3 డి టీజర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యాక ప్రభాస్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. 

టీజర్ రిలీజ్ అయ్యాక మొదట నేను కూడా ఫోన్ లో చూశాను. ఆ తర్వాత ఇంటికెళ్లి టీవీలో చూశాను. అప్పుడు ఇంకా బాగా నచ్చింది. ఇప్పుడు 3డి లో చూస్తుంటే అద్భుతంగా ఉంది. జరుగుతున్న ట్రోలింగ్ గురించి నేను చెప్పేది ఒక్కటే. బాహుబలి రిలీజ్ అయ్యాక కూడా శివలింగం సీన్ పై ట్రోలింగ్ చేశారు. శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టి మీమ్స్ చేశారు. 

అప్పుడు ప్రభాస్ కి ఒక్కటే చెప్పా.. తడిబట్ట వేసుకుని పడుకో సినిమా సూపర్ హిట్ అని అన్నా. అలాగే జరిగింది. ఇప్పుడు ఆదిపురుష్ కూడా అంతే ఆదిపురుష్ చిత్రానికి కూడా ఫస్ట్ డే నెగిటివ్ టాక్ రావచ్చు. కానీ దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలైన ఆడియన్స్ రెస్పాన్స్ ఆ తర్వాత వస్తుంది. కేవలం టీజర్ చూసేసి సినిమాని జడ్జ్ చేయలేము. బిగ్ స్క్రీన్ లో అందరితో కలసి మూవీ చూస్తే ఆ అనుభూతి కలుగుతుంది. 

దర్శకుడు రామాయణం నుంచి ఒక భాగం తీసుకుని దానిని తన ఐడియాకి తగ్గట్లుగా తెరకెక్కించారు. ఆదిపురుష్ పెద్ద విజయం సాధిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వం చిత్రానికి కూడా మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది అని దిల్ రాజు అన్నారు. 

click me!