రూ.90 వేల కోట్లు దాటేసిన ఐపీఎల్ విలువ... రెండేళ్లలో 75 శాతం వృద్ధి! అయినా ఎక్కడి సమస్యలు అక్కడే...

First Published Dec 22, 2022, 1:02 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ మరో రికార్డు సాధించింది. గత సీజన్‌లో ఐపీఎల్ విలువ రూ.90 వేల కోట్లు దాటేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఐపీఎల్ 2022 సీజన్‌ మొత్తం విలువ 90,178 కోట్ల రూపాయలు. 2020 సమయంలో రూ.51 వేలుగా ఉన్న ఐపీఎల్ మార్కెట్ విలువ, రెండేళ్లలో 75 శాతం వృద్ధి సాధించింది..

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీలను తీసుకురావడం ద్వారా రూ.12,690 కోట్లు ఆర్జించింది బీసీసీఐ. వీటి రాకతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ విలువ రూ.90 వేలకు దాటేసింది. వచ్చే 2023 సీజన్ సమయానికి ఐపీఎల్ వాల్యూ లక్ష కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.. 

Image credit: PTI

అలాగే ఐపీఎల్ 2023-27 ప్రసార హక్కుల ద్వారా మరో రూ.41 వేల కోట్లు, భారత క్రికెట్ బోర్డు ఖాతాలో చేరాయి. ఇన్ని వేల కోట్లు, బీసీసీఐ ఖాతాలో చేరుతున్నా సమస్యలు మాత్రం తీరడం లేదు...

అంతర్జాతీయ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాల్లో సరైన వసతులు ఉండడం లేదు. ఆఖరికి సీట్లను కూడా సరైన మెయింటైన్ చేయలని దుస్థితిలో ఉన్నాయి ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డు. ఈ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందు వరుసలో ఉంటుంది...

చిన్న వర్షం పడితే చిత్తడిగా మారే స్టేడియాలు, ప్రపంచవేదికపై భారత్ పరువు తీస్తూనే ఉన్నాయి. 2022లోనూ స్టేడియాలను ఆరబెట్టేందుకు బొగ్గుల కుంపటి, హెయిర్ డ్రైయర్ వాడాల్సిన పరిస్థితి బీసీసీఐది. సరైన డ్రైనేజీ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన, ఆచరణ రెండూ బీసీసీఐలో కనిపించడం లేదు.. 

అంతర్జాతీయ మ్యాచుల సమయంలోనూ డీఆర్‌ఎస్ సరిగా పని చేయడం లేదు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ, విజయ్ హాజారే ట్రోఫీ దేశవాళీ టోర్నీల్లో అయితే డీఆర్‌ఎస్ నామమాత్రంగానే ఉంటోంది. ఈ మ్యాచులను చూద్దామని సరైన యూట్యూబ్ ఛానెల్ అందుబాటులో లేదు...

ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచులను ఆయా క్రికెట్ క్లబ్‌లకు చెందిన యూట్యూబ్ ఛానెళ్లు ప్రత్యేక్ష ప్రసారం చేస్తున్నాయి. అయితే మనదగ్గర అంత సీన్ లేదు. బీసీసీఐ ఛానెల్‌లో అప్పుడప్పుడూ కొన్ని వీడియోలు పోస్టు చేస్తుంటారంతే...

బీసీసీఐ వెబ్‌సైట్ గురించి చాలామందికి తెలియనే తెలీదు. యూట్యూబ్ ఛానెల్ ఉందో లేదో తెలీదు. ఉన్నా అందులో కనిపించే వీడియోల్లో క్వాలిటీ ఉండదు. అన్నింటికీ మించి దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్న ప్లేయర్ల గణాంకాల గురించి సరైన లెక్కలు కూడా దొరకని పరిస్థితి..

డబ్బులు లేక అభివృద్ధి ఆగిపోవడం చాలా కామన్. అయితే వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా, భారత క్రికెట్ వ్యవస్థలో ఇంకా సమస్యలు అలాగే ఉండడం మాత్రం మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం, చేతకాని తనం, అలసత్వం వల్లేనని విమర్శలు వస్తున్నాయి. 

click me!