T20 World Cup : ఐపీఎల్ లో అద‌ర‌గొట్టినా ఈ ఐదుగురు ప్లేయ‌ర్ల‌కు భార‌త జ‌ట్టులో చోటుద‌క్క‌లేదు.. !

By Mahesh Rajamoni  |  First Published Apr 30, 2024, 5:49 PM IST

India T20 World Cup 2024 squad : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 01 నుండి అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా జరగనుంది. ఈ క్ర‌మంలోనే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 కోసం బీసీసీఐ రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా 15 మంది ఆటగాళ్లతో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది.
 


India T20 World Cup 2024 squad :  జూన్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024కు భారత జట్టును ఎట్టకేలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగ‌ళ‌వారం ప్రకటించింది. ఇందులో యంగ్ ప్లేయ‌ర్ల‌తో పాటు సినియ‌ర్ స్టార్లు కూడా ఉన్నారు. అనుకున్న‌ట్టుగానే రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. కొంతమంది ఆటగాళ్లు పునరాగమనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుండగా, మరికొందరు కొత్త స్టార్లకు కూడా అవకాశం లభించింది.

రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టులో విరాట్ కోహ్లి తిరిగి రావడం విశేషం. అలాగే,  యుజ్వేంద్ర చాహల్ జట్టులో అద్భుతంగా పునరాగమనం చేసాడు. ఐపీఎల్ లో సిక్స‌ర్ల మోత మోగిస్తున్న‌ శివమ్ దూబే మొదటిసారి ప్రపంచ కప్ జట్టులోకి వ‌చ్చాడు. జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, రిషబ్ పంత్ ఎంపిక కాగా, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. బీసీసీఐ రిజర్వ్ ప్లేయర్లుగా నలుగురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. వారిలో శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లు ఉన్నారు.

Latest Videos

అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ 2024లో అద్భుత‌మైన బ్యాటింగ్ తో ప‌రుగుల సునామీ సృష్టిస్తున్న ప‌లువురు ప్లేయ‌ర్ల‌ను, స్టార్ ఆటగాళ్ల‌ను బీసీసీఐ ప‌క్క‌న‌బెట్టింది. రాబోయే టి 20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో చోటు సంపాదించలేకపోయారు. ఆ లిస్టులో ఉన్న టాప్ 5 ప్లేయ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే..

1. కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్)

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సీజన్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గాయం కారణంగా, అతను కొంతకాలం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. టీమిండియాకు అనేక విజ‌యాలు అందించాడు. కానీ వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త‌ జ‌ట్టులో స్థానం సంపాదించ‌లేక‌పోయాడు.

2. రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్)

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొన‌సాగుతున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి 447 పరుగులు చేశాడు. కానీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 భార‌త జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

3. అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

సన్‌రైజర్స్ హైదరాబాద్ యంగ్ ప్లేయ‌ర్, ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. 9 మ్యాచ్‌లలో 303 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 214.89 గా ఉండ‌టం విశేషం. జాతీయ జట్టులో అరంగేట్రం చేయ‌ని ఈ ప్లేయ‌ర్ ను బీసీసీఐ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టుకు ఎంపిక చేయ‌లేదు.

4. హర్షల్ పటేల్ (పంజాబ్ కింగ్స్)

గత కొన్ని సీజన్లలో తన బౌలింగ్ తో ఆకట్టుకున్న హర్షల్ పటేల్ ఈసారి కూడా ఐపీఎల్ లోనూ అద్భుతాలు చేస్తున్నాడు. అతను 9 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ రేటు కూడా చాలా బాగుంది. కానీ ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా ఉండటంతో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

5. సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్)

యంగ్ ప్లేయ‌ర్ సాయి సుదర్శన్ కూడా ఈ ఐపీఎల్ సీజన్‌లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా ఉన్నాడు. 9 మ్యాచ్‌ల్లో 418 పరుగులు చేశాడు. కానీ టీ20 ప్రపంచకప్ భార‌త జ‌ట్టుకు ఎంపిక కాలేదు.

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వు ప్లేయర్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

click me!