ఆఖరి బాల్, ఆఖరి వికెట్... టీమిండియాని నాలుగేళ్ల పాటు వెంటాడిన పాక్ చేతుల్లో పరాభవం...

First Published Aug 25, 2022, 12:35 PM IST

ఆఖరి బాల్... ఇంకొక్క వికెట్ తీస్తే అద్భుత విజయం... ఆఖరి బంతి‌కి 4 పరుగులు ఇవ్వకుండా అడ్డుకుంటే చాలు, గెలిచేయొచ్చు. అయినా టీమిండియా ఓడింది... 1986 అస్ట్రల్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జరిగిన ఈ సంఘటన! ఈ పరాభవ భారాన్ని భారత జట్టు నాలుగేళ్లపాటు మోయాల్సి వచ్చిందని అంటున్నాడు అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్...

1986 ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియా పాల్గొనలేదు.శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రమే 1986 ఆసియా కప్ ఆడాయి. 1985లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌ తీవ్ర వివాదాస్పదమైంది. ఈ గొడవల కారణంగా శ్రీలంక వేదికగా జరిగిన 1986 ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు పాల్గొనలేదు...
 

అయితే అంతకుముందు షార్జా క్రికెట్ అసోసియేషన్, ఐసీసీ ఆధ్వర్యంలో ఆస్ట్రల్ ఆసియా కప్ టోర్నీ జరిగింది. 1986లో ప్రారంభమైన తొలి ఎడిషన్‌లో ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలకి చెందిన ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పాల్గొన్నాయి.. 

తొలి రౌండ్‌లో న్యూజిలాండ్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు, సెమీ ఫైనల్‌లో శ్రీలంకపై కూడా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరింది. మరోవైపు ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న పాకిస్తాన్, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ని చిత్తుగా ఓడింది ఫైనల్ చేరింది...

పాక్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ 64 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది పాకిస్తాన్. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ నరాలు తెగింతే ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది...
 

కృష్ణమాచారి శ్రీకాంత్ 80 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేయగా సునీల్ గవాస్కర్ 134 బంతుల్లో 6 ఫోర్లతో 92 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత దిలీప్ వెంగ్‌సర్కార్ 64 బంతుల్లో ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసి గవాస్కర్‌తో కలిసి రెండో వికెట్‌కి 99 పరుగులు జోడించారు...

216 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. అయితే ఆ తర్వాత కీర్తి ఆజాద్ డకౌట్ కాగా కపిల్ దేవ్ 8, ఛేతన్ శర్మ 10, రవిశాస్త్రి 1 పరుగు చేసి పెవిలియన్ చేరడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది టీమిండియా. 246 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాక్‌కి శుభారంభం దక్కలేదు...

ముదస్సర్ నజర్ 5, రమీజ్ రాజా 10, మోహ్సీన్ ఖాన్ 36 పరుగులు చేసి అవుట్ కావడంతో 61 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. అయితే జావెద్ మియాందాద్ 114 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగులు చేసి క్రీజులో కుదురుకుపోయాడు...

సలీం మాలిక్ 21, అబ్దుల్ ఖాదర్ 34, ఇమ్రాన్ ఖాన్ 7, మన్జుర్ ఇలాహీర్ 4, వసీం అక్రమ్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆఖరి ఓవర్‌లో పాకిస్తాన్ విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు కావాల్సి వచ్చాయి. ఛేతన్ శర్మకు ఆఖరి ఓవర్ అందించాడు కెప్టెన్ కపిల్ దేవ్...

తొలి బంతికి వసీం అక్రమ్ రనౌట్ కాగా, రెండో బంతికి బౌండరీ బాదాడు మియాందాద్. మూడో బంతికి సింగిల్ వచ్చింది. నాలుగో బంతికి జుల్దార్‌నైన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు ఛేతన్ శర్మ. దీంతో ఆఖరి 2 బంతుల్లో 5 పరుగులు కావాల్సి వచ్చాయి. ఐదో బంతికి తాసీఫ్ అహ్మద్ కొట్టిన షాట్‌ని అందుకున్న అజారుద్దీన్ రనౌట్ చేసే అవకాశాన్ని మిస్ చేశాడు. వికెట్లకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ రనౌట్ చేయలేకపోయాడు అజారుద్దీన్...

దీంతో ఆఖరి బంతికి పాక్ విజయానికి ఫోర్ కావాల్సి వచ్చింది. ‘ఆఖరి ఓవర్‌లో 12-13 పరుగులు చేయడమంటే ఆ రోజుల్లో అసాధ్యమైన పని. లాస్ట్ ఓవర్‌ ఛేతన్‌కి ఇచ్చాం. ఇప్పటికీ అది పొరపాటు కాదని నా అభిప్రాయం. ఆఖరి బంతికి 4 పరుగులు కావాల్సిన టైమ్‌లో లో యార్కర్ వేయాల్సిందిగా ఛేతన్‌కి సూచించాం...
 

ఆఖరి బంతికి బౌండరీ ఇవ్వకుండా ఆపాలంటే అంతకుమించి మరో ఛాయిస్ లేదు. అతను తన బెస్ట్ ట్రై చేశాడు. అయితే అది లో ఫుల్ టాస్‌గా మారింది. మియందాద్ దాన్ని కరెక్ట్‌గా మిడిల్ చేసి, కనెక్ట్ చేశాడు. ఇప్పటికీ ఆ మ్యాచ్‌ని గుర్తు చేసుకుంటే ఏదోలా ఉంటుంది. ఆ ఒక్క బాల్... మా ఆత్మవిశ్వాసాన్ని ఘోరంగా దెబ్బ తీసింది... పాకిస్తాన్ చేతుల్లో పరాభవం నుంచి కోలుకోవడానికి మాకు నాలుగేళ్లు పట్టింది. ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. 

click me!