Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు

Published : Jun 20, 2025, 06:26 AM IST

Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో గ్రాండ్ గా జరగనుంది. ఏకంగా 28 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు లక్షల మందితో యోగా డే ఉత్సవాలతో గిన్నిస్ రికార్డును సాధించనుంది.

PREV
15
28 కిలోమీటర్ల కోస్తా రోడ్డుపై యోగా డే

జూన్ 21వ తేదీ ఉదయం అందమైన తొలికిరణాలకు తోడుగా విశాఖపట్నంలోని బీచ్ రోడ్ అంతా యోగా అభ్యాసంతో నిండిపోనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ యోగా సదస్సుగా గిన్నిస్ వరల్డ్ రికార్డులలో స్థానం సంపాదించాలనే లక్ష్యంతో జరుగుతోంది. 

ప్రజలకు యోగా, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వైజాగ్ కు గ్లోబల్ గుర్తింపును తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకుంది. విశాఖపట్నంలో పర్యాటకం మరింత పెంచడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యలు కూడా ఉన్నాయి.

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుండి భీమునిపట్నం వరకు 28 కిలోమీటర్ల రోడ్డుపై యోగా అభ్యాసం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యువత, వృద్ధులు, నిపుణులు, యోగా నేర్చుకునే వారు, యోగా గురువులు కలిపి మొత్తం ఐదు లక్షల మందికిపైగా పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

25
విశాఖలో యోగా డే ప్రణాళికలు, ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా డే భారీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, విశాఖ జిల్లా క్రీడా శాఖ, ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగం, విశాఖ జిల్లా పరిపాలన యంత్రాంగం సంయుక్తంగా పర్యవేక్షణ చేపట్టాయి. రాష్ట్ర హోంమంత్రి వి. అనిత గత వారం జరిగిన సమావేశంలో పలు కీలక ఏర్పాట్లను వెల్లడించారు. ప్రతి కిలోమీటరులో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 200 అంబులెన్సులు, 2,000 సీసీటీవీలు వినియోగించనున్నారు.

డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జూన్ గల్లియాట్ ప్రకారం.. బీచ్ రోడ్‌పై 300 కంటే ఎక్కువ విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగంలో సుమారు 1,000 మంది యోగాభ్యాసకులు ఒకేసారి యోగా చేసే ఏర్పాటు ఉన్నాయి. ప్రతి విభాగంలో ఒక శిక్షణ పొందిన యోగా ఇన్‌స్ట్రక్టర్, ఇద్దరు డెమోన్స్ట్రేటర్లను నియమించారు.

35
విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డేలో క్రీడా సంఘాలు, విద్యార్థులు

వైజాగ్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో 47 క్రీడా సంఘాలు, విశాఖ క్రికెట్ అసోసియేషన్ సహా, 10,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈవెంట్‌లో యోగా చేయడమే కాకుండా యూత్ యాక్టివేషన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే యూత్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 1,400 మంది విద్యార్థులు, అందులో 200 మంది విదేశీ విద్యార్థులు కూడా ప్రత్యేక శిక్షణ పొంది ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. అదనంగా, విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ గ్రౌండ్స్, అక్కయపాలెంలో విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వంటి ప్రత్యామ్నాయ వేదికలపై కూడా యోగా అభ్యాసం జరుగుతుంది.

జూన్ 20వ తేదీ సాయంత్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 25,000 మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేస్తారు. ఇది మరో రికార్డు స్థాయిలో ఉండనుంది.

45
కామన్ యోగా ప్రోటోకాల్, శిక్షణ

45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఇది ప్రార్థనతో ప్రారంభమై, శరీర కదలికలతో సాధనాలు చేయడం, 25 నిమిషాల యోగా ఆసనాలు, చివరగా శ్వాస సాధన, ధ్యానం ముగుస్తుంది. తాడాసనం, భద్రాసనం, వజ్రాసనం, భుజంగాసనం, శవాసనం వంటి ఆసనాలు ఇందులో భాగంగా ఉన్నాయి. 

ప్రజల్లో వ్యతిరేకత, ట్రాఫిక్ సమస్యలు

యోగా డే నేపథ్యంలో విశాఖలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ఈ కార్యక్రమం పట్ల సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ జామ్‌లు, మార్గాల మళ్లింపుల వల్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. “MVP కాలనీలో నుంచి సిరిపురం వెళ్లేందుకు గంట పట్టింది. యోగా కోసం ఇది భారం కావడం తగదు” అని ఓ యూజర్ ట్వీట్ చేశారు.

55
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెప్పారంటే?

అమరావతిలో విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం రెండు గిన్నిస్ రికార్డులు, మొత్తం 22 వరల్డ్ రికార్డులు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు. “రాష్ట్రం మొత్తంలో 8 లక్షల ప్రదేశాల నుంచి, దేశ, ప్రపంచవ్యాప్తంగా పాల్గొననున్న ప్రజల సంఖ్య 2.39 కోట్లకు చేరింది” అని అన్నారు.

ప్రతి పాఠశాలలో వారం రోజులలో ఒక్కసారైనా యోగా తరగతులు ఉండేలా చేయడం, యోగా విశ్వవిద్యాలయం స్థాపన లక్ష్యాలుగా పెట్టుకున్నారు.

ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా ఏపీ రాష్ట్రం మొత్తం మీద 1,29,249 ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారని చంద్రబాబు తెలిపారు. “ఇలాంటి స్థాయిలో యోగా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. ఇది చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుంది” అని చెప్పారు.

అలాగే, ప్రజల్లో యోగాపై ఆసక్తి గణనీయంగా పెరిగిందని, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తిగా మారిందన్నారు. ఈ యోగా కార్యక్రమాల కోసం ఇప్పటివరకు ఏకంగా 1 కోటి 5 లక్షల 58 వేల మంది ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories