భారత వృద్ధి రేటు అంచనాను సవరించిన ప్రపంచ బ్యాంక్.. కానీ పుంజుకుంటుందంటూ నివేదిక

By Siva KodatiFirst Published Oct 6, 2022, 9:29 PM IST
Highlights

ప్రపంచ బ్యాంకు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును సవరించింది. దానిని 6.5 శాతానికి సవరించిన ప్రపంచ బ్యాంకు ఒక ముఖ్యమైన సూచనను ఇచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధితో వార్షిక సమావేశానికి ముందు విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ తాజా దక్షిణాసియా ఆర్ధిక ఫోకస్‌లో సవరించిన అంచనాలు వెల్లడయ్యాయి. 

అంతర్జాతీయంగా ఆర్ధిక పరిస్ధితులను పరిగణనలోనికి తీసుకుని 2022- 23 ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ఆర్ధిక వ్యవస్థకు అంచనా వేసిన వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. దీనిలో భాగంగా జూన్ 2022లో అంచనా వేసిన వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పుంజుకుంటుందని ప్రపంచబ్యాంక్ తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థ 8.7 శాతం వృద్ధిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధితో వార్షిక సమావేశానికి ముందు విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ తాజా దక్షిణాసియా ఆర్ధిక ఫోకస్‌లో సవరించిన అంచనాలు వెల్లడయ్యాయి. 

ప్రపంచబ్యాంక్ దక్షిణాసియా చీఫ్ ఎకనామిస్ట్ హన్స్ టిమ్మర్ ప్రకారం దక్షిణాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గానే వుంది. సాపేక్షింగా బలమైన వృద్ధితో కోవిడ్ మొదటి దశలోనే భారత ఆర్ధిక వ్యవస్థ పదునైన సంకోచం నుంచి తిరిగి పుంజుకుందని టిమ్మర్... జాతీయ వార్తా సంస్థ పీటీఐతో చెప్పారు. విదేశీ రుణం పెద్దగా లేకపోవడం వల్ల ప్రయోజనం వుందని భావించిన హన్స్.. భారతదేశం బాగా పనిచేసిందని కితాబిచ్చారు. భారతదేశ ద్రవ్య విధానం వివేకవంతంగా వుందని.. ముఖ్యంగా సేవల రంగంలో ఇండియా బాగా రాణిస్తోందన్నారు. 

ప్రస్తుత అంతర్జాతీయ వాతావరణం కారణంగా ఆర్ధిక సంవత్సరానికి తగ్గిన అంచనా ఎక్కువగా వుందన్నారు. ఇది భారత్ సహా అన్ని దేశాల్లో క్షీణిస్తోందని టిమ్మర్ పేర్కొన్నారు. ఏడాది మధ్యలో ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ కనిపిస్తోందని.. ప్రపంచవ్యాప్తంగా మందగమనం యొక్క తొలి సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. క్యాలెండర్ ఇయర్ రెండవ భాగంలో భారత్ సహా అనేక ఇతర దేశాలలో సాపేక్షంగా బలహీనంగా వుంటుందని టిమ్మర్ అభిప్రాయపడ్డారు. 

ప్రపంచ ద్రవ్య విధానం కఠినతరం చేయడంతో పాటు అధిక ఆదాయ దేశాల వాస్తవ ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి మందగించడం, ఆర్ధిక సంవత్సరానికి తగ్గుదల అంచనాల వెనుక రెండు కారకాలుగా హన్స్ ఉదహరించారు. గ్లోబల్ మానిటరీ పాలసీ కఠినతరం చేయడం వల్ల అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధన ప్రవాహాలు పెరుగుతాయి. అలాగే అక్కడ వడ్డీ రేట్లు, అనిశ్చితి పెరుగుతాయని.. ఇది పెట్టుబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. 

భారతదేశం బలహీనంగా లేదని.. కొన్ని ఇతర దేశాల కంటే మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అది ఇప్పటికీ కొన్నిఅంశాల నుంచి బయటపడలేదన్నారు. అది వస్తువుల అధిక ధరలను నావిగేట్ చేయాల్సిన అవసరం వుందని హాన్స్ పేర్కొన్నారు. సామాజిక భద్రతా వలయాలను విస్తరించడం, డిజిటల్ ఆలోచనలను ఉపయోగించడం వంటి విషయాలో భారత్ ఉదాహరణగా నిలిచిందని ఆయన అన్నారు. 

కానీ హన్స్.. భారత ప్రభుత్వం అనుసరిస్తోన్న కొన్ని విధానాలతో ఏకీభవించడం లేదు. వస్తువుల అధిక ధరలకు సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వ స్పందనకు దీర్ఘకాలంలో ఎదురుదెబ్బ తగలవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ.. బియ్యం ఎగుమతులపై అధిక సుంకాలను విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉటంకిస్తూ .. దేశీయంగా ఆహారం భద్రతను సృష్టించడం తార్కికంగా వున్నప్పటికీ.. ఇటువంటి చర్యలు మిగిలిన ప్రాంతాలలో, ప్రపంచవ్యాప్తంగా మరిన్ని సమస్యలను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

భారతదేశం కొన్ని కీలక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం వుందన్న ఆయన.. తాము సాపేక్షంగా అనుకూలమైన వృద్ధి రేటును చూస్తున్నప్పటికీ, ఇది ఆర్ధిక వ్యవస్థలో కొద్దిభాగం మాత్రమేనని అన్నారు. ఇది అన్ని కుటుంబాలకు గణనీయమైన ఆదాయ వృద్ధికి దోహదపడదని హన్స్ అన్నారు. భారత్‌లో ప్రస్తుతం వున్న పెద్ద సంస్థలు, ఎఫ్‌డీఐలపై దృష్టి కేంద్రీకరించారని .. కానీ ఇది చాలదని, ఆర్ధిక వ్యవస్థలో ఎక్కువ మందిని కలుపుకోవాలని ఆయన సూచించారు. 
 

click me!