కార్పొరేట్ ప్రజాస్వామ్యానికి ముప్పు...సైరస్ మిస్త్రీ నియామకంపై టాటా సన్స్

By Sandra Ashok KumarFirst Published Jan 3, 2020, 1:14 PM IST
Highlights

సైరస్ మిస్త్రీని తమ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పున:నియమించాలని ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పు కార్పొరేట్ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని టాటా సన్స్ వాదించింది. గత నెల 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును టాటా సన్స్ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
 

న్యూఢిల్లీ: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని మళ్లీ నియమించాలంటూ ఎన్సీఎల్‌ఎటీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మిస్త్రీ తిరిగి నియమించాలంటూ గతనెల 18వ తేదీన ఎన్సీఎల్‌ఎటీ (నేషనల్ కంపెనీ లా అప్పీల్లేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పు కార్పొరేట్ ప్రజాస్వామ్యాన్ని, డైరెక్టర్లు, బోర్డు హక్కులు బలహీనపర్చేలా ఉందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో టాటా సన్స్ పేర్కొంది. 

ఎన్సీఎల్‌ఎటీ ఇచ్చిన తీర్పును ఖండిస్తూ తోసిపుచ్చాలని గతంలో టాటా సన్స్ లిమిటెడ్‌గా పిలిచే టీఎస్‌పీఎల్ (టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్) కోరింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ నిర్ణయం కార్పొరేట్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని టాటా సన్స్ వాదించింది. టాటా గ్రూప్ ప్రధాన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బోర్డు సమావేశం జనవరి 9న జరగనుంది. ఈ పరిస్థితిలో జనవరి ఆరో తేదీన సుప్రీంకోర్టు ప్రారంభం కానుందని, వెంటనే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని టాటా సన్స్ న్యాయవాదులు కోరారు. 

also read కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఆర్‌బి‌ఐ కొత్త యాప్...

సైరస్ మిస్త్రీని తొలగించి ఎన్ చంద్రశేఖరన్‌ను చైర్మన్‌గా నియమించాలన్న టాటా సన్స్ నిర్ణయాన్ని ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. టాటా సన్స్ అప్పీల్ చేయడానికి 4 వారాలు సమయం ఇచ్చింది. సైరస్ మిస్త్రీని తొలగించే నిర్ణయం చట్టవిరుద్ధం అని తీర్పు ఇచ్చిన అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎటువంటి కారణం చెప్పలేదు.

సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలన్న అప్పీలేట్ ట్రిబ్యునల్ తీర్పు గ్రూప్ ప్రధాన సంస్థల పనితీరుపై ప్రభావం చూపిందని, సంస్థలో గందరగోళానికి దారితీసిందని టాటా సన్స్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. టాటా సన్స్ చైర్మన్, డైరెక్టర్‌గా సైరస్ మిస్త్రీ పదవీకాలం 2017 మార్చిలో ముగిసింది.

రతన్ టాటా, టాటా ట్రస్టుల నామినీల నిర్ణయం తీసుకోవడాన్ని నిషేధించడం అంటే వాటాదారుల, బోర్డు సభ్యుల హక్కులను అణచివేయడమే అవుతుంది. ఇది కార్పొరేట్ ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తుంది. ట్రిబ్యునల్ ఉత్తర్వు ప్రమాదకరమైన తీర్పులకు ఉదాహరణగా చెప్పవచ్చని టాటా సన్స్ వాదించింది. 

టాటా సన్స్‌ను పబ్లిక్ నుండి ప్రైవేట్ సంస్థగా మార్చడానికి అనుమతించే నిర్ణయం చట్టవిరుద్ధమని టాటా సన్స్-మిస్త్రీ కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. కంపెనీల రిజిస్ట్రార్ (ఆర్‌ఓసీ) దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, చట్టం ప్రకారమే ‘ప్రైవేట్’కు ఆమోదం లభించిందని పేర్కొంది. చట్టవిరుద్ధమైన పదాన్ని తొలగించాలని ఆర్‌ఓసీ విజ్ఞప్తి చేసింది. దీనిపై విచారణను ట్రిబ్యునల్ శుక్రవారం వరకు వాయిదా వేసింది. కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేట్, పబ్లిక్ సంస్థల నిర్వచనంపై ట్రిబ్యునల్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వివరాలను కోరింది. 

also read ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​... అందరి చూపు దానిపైనే

సెప్టెంబర్ 2017లో టాటా సన్స్‌ను పబ్లిక్- నుంచి -ప్రైవేట్ సంస్థగా మార్చడానికి వాటాదారులు ఆమోదించారు. టాటా సన్స్‌ను ఆర్వోసీ ఒక ప్రైవేట్ సంస్థగా నమోదు చేసింది. దీంతో ఇకపై సంస్థ ముఖ్యమైన నిర్ణయాలకు వాటాదారుల అనుమతి అవసరం లేదు, బోర్డు ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకోవచ్చు. సైరస్ మిస్త్రీ కుటుంబం దీనికి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. మిస్త్రీ కుటుంబం టాటా సన్స్‌లో 18.4 శాతం వాటాలను కలిగి ఉంది. 

టాటా సన్స్ బోర్డు 2016 అక్టోబర్ 24న మిస్త్రీని చైర్మన్ పదవి నుండి తొలగించింది. బోర్డు సభ్యులు మిస్త్రీపై నమ్మకం లేదని చెప్పారు. తదనంతరం 2016 డిసెంబర్‌లో మిస్త్రీ టాటా గ్రూప్ కంపెనీల డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారు. చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో తీసుకున్న నిర్ణయాన్ని మిస్త్రీ సవాలు చేశారు. 

టాటా సన్స్ నిర్వహణలో, మైనారిటీ వాటాదారులను అణచేయడం వంటి ఆరోపణలతో మిస్త్రీ పిటిషన్ చేశారు. అయితే, గత ఏడాది జూలైలో టాటా సన్స్‌కు అనుకూలంగా ఎన్‌సిఎల్‌ఎటి తీర్పు ఇచ్చింది. దీని తర్వాత మిస్త్రీ అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు ఆశ్రయించగా, ఆయన్ని తిరిగి నియమించాలని తాజాగా తీర్పు వచ్చింది.
 

click me!