కొత్త బడ్జెట్ లో భారీ నిధుల కేటాయింపులపైనే వారి ఆశలు...కానీ...?

By Sandra Ashok KumarFirst Published Jan 13, 2020, 1:41 PM IST
Highlights

దేశీయ ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు రూ.10 వేల కోట్ల పైచిలుకు అవసరాలు ఉండగా, గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో రూ.2500 కోట్లు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గణనీయ స్థాయిలో నిధులు కేటాయిస్తారని బీమా రంగ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జనరల్‌ బీమా సంస్థల కోసం రాబోయే బడ్జెట్‌లో మరో విడుత మూలధన సాయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సంస్థలను ఆర్థికంగా పరిపుష్ఠం చేయాలని భావిస్తున్న కేంద్రం.. రెండోసారి మూలధనాన్ని అందించే వీలున్నది. 

గతేడాది బీమా సంస్థలకు బడ్జెట్‌లో రూ.2500 కోట్ల సాయం
ఇప్పటికే నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు మోదీ సర్కార్ రూ.2,500 కోట్ల సాయంచేసింది. అయినా ఈ సంస్థలకు అదనంగా రూ.10 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల వరకు మూలధన అవసరాలు ఉన్నాయి.

also read వాల్ మార్ట్ ఇండియా స్టోర్లలో ఉద్యోగుల తొలగింపు...కారణం..?

బీమా రంగ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు?
ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లో బీమా రంగ సంస్థల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల ప్రకటన ఉండవచ్చన్న అంచనాలు గట్టిగా ఉన్నాయి. కాగా, నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలను విలీనం చేసి ఒకే పెద్ద సంస్థగా నిలబెట్టాలని కేంద్రం భావిస్తున్నది. 

బీమా సంస్థల మొత్తం ప్రీమియం రూ.41,461 కోట్లు
మూడు బీమా విలీన సంస్థల విలువ రూ.1.2 లక్షల కోట్ల నుంచి 1.5 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. 2017 మార్చి 31వ తేదీ నాటికి ఈ మూడు సంస్థలు కలిసి 200లకుపైగా ఉత్పత్తులను విక్రయించాయి. మొత్తం ప్రీమియం విలువ రూ.41,461 కోట్లుగా ఉన్నది. 

బీమా సంస్థల నికర మార్కెట్ రూ.9,243 కోట్లు
మార్కెట్‌లో ఇది సుమారు 35 శాతానికి సమానం. ఈ సంస్థల ఉమ్మడి నికర విలువ రూ.9,243 కోట్లుగా ఉన్నది. వీటిలో దాదాపు 44 వేల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటికి 6000కి పైగా కార్యాలయాలున్నాయి. ఇక 2017లో ప్రభుత్వ రంగ న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

కస్టమ్స్‌ సుంకం తగ్గించాలని అల్యూమినియం పరిశ్రమ అప్పీల్
వచ్చే బడ్జెట్‌లో అల్యూమినియం ఫ్లోరైడ్‌ తదితర కీలక ముడి సరుకులపై కనీస కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించాలని అల్యూమినియం పరిశ్రమ కోరుతున్నది. అధిక దిగుమతి సుంకాలు.. పరిశ్రమ పురోగతికి విఘాతం కలిగిస్తున్నాయని అల్యూమినియం అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

also read సంక్రాంతికి మళ్ళీ బంగారం ధర పెరగొచ్చు...ఎందుకింత డిమాండ్...?

అల్యూమినియం దిగుమతుల్లో 58 శాతం తుక్కే
‘భారతీయ అల్యూమినియం పరిశ్రమలో పోటీని పెంచడానికి, సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కీలక ముడి సరుకులపై కనీస కస్టమ్‌ సుంకాన్ని తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఏఏఐ తెలిపింది. 
విదేశాల నుంచి దేశంలోకి అల్యూమినియం తుక్కు దిగుమతి ఏటా పెరుగుతున్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇప్పటిదాకా జరిగిన మొత్తం అల్యూమినియం దిగుమతుల్లో దాదాపు 58 శాతం తుక్కేనని ఏఏఐ వెల్లడించింది. 

విదేశాలకు రూ.17,200 కోట్ల ఫారెక్స్ నిల్వలు
ఫలితంగా రూ.17,200 కోట్ల విలువైన ఫారెక్స్‌ నిల్వలు బయటి దేశాలకు తరలిపోయాయని, దిగుమతి సుంకం తగ్గితే కొంత ఊరట ఉంటుందని అభిప్రాయపడింది. మిలియన్‌ టన్ను బొగ్గుపై విధిస్తున్న రూ.400 సెస్ తొలగించాలని కోరింది. అల్యూమినియం పరిశ్రమలకు ఇది ప్రోత్సాహకంగా ఉంటుందన్నది.
 

click me!