వస్తువులపై 50 నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాల పెంపు....

By Sandra Ashok KumarFirst Published Jan 18, 2020, 11:22 AM IST
Highlights

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పెంపు మార్గాలపై కేంద్రీకరించారు. అందులో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాలను పెంచే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు.

న్యూఢిల్లీ: దేశీయంగా ఆర్థిక మందగమనం, పడిపోతున్న పన్ను వసూళ్ల నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించేందుకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. ఆదాయం పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నిత్యావసర వస్తువులపై సుంకాలు.. ప్రత్యేకించి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తదితర పన్నులను సవరించే పేరిట పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

also read రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల జోరు... చరిత్రలో ఇదే తొలిసారి

ప్రధానమంత్రి ప్రతిష్ఠాత్మక ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం కింద దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నదని తెలియవచ్చింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నుంచి ఆర్థిక శాఖకు కొన్ని ప్రతిపాదనలు వెళ్లాయి.

వీటిలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 300 వస్తువులపై కస్టమ్స్, దిగుమతి సుంకాలను సవరించాలని వాణిజ్య, పరిశ్రమల శాఖలు ప్రతిపాదించాయి. వీటిలో ఫర్నీచర్, రసాయనాలు, రబ్బర్, కోటెడ్ పేపర్, పేపర్ బోర్డులు ఉన్నాయి. 

రబ్బర్ టైర్ల దిగుమతిపై ప్రస్తుతం అమలులో ఉన్న 10-15 శాతం దిగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచాలని కేంద్ర పరిశ్రమల శాఖ ప్రతిపాదన పంపిందని సమాచారం. ఇక పాదరక్షల ఉత్పత్తుల దిగుమతులపై ప్రస్తుతం అమలులో ఉన్న 25 శాతం ఎక్సైజ్ డ్యూటీని 35 శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా దిగుమతి అయ్యే చౌక పాదరక్షలపై ఈ సుంకాల ప్రభావం ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. చాలా వరకు దిగుమతులు ఆసియా దేశాల నుంచే జరుగుతాయి. ఈ దేశాలతో భారతదేశానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులో ఉంది. ఈ దేశాల ద్వారా చైనా తన ఉత్పత్తులను భారతదేశంలోకి చొప్పిస్తుందన్న సందేహాలు ఉన్నాయి. 

also read నేను అప్పుడే ప్రోపోజ్ చేసి మంచి పని చేశాను....:ఆనంద్ మహీంద్ర

ఉడ్ ఫర్నీచర్ దిగుమతులపైనా కస్టమ్స్ సుంకాలు తప్పక పోవచ్చునన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న 20 శాతం వరకు దిగుమతి సుంకం అమలులో ఉండగా, దాన్ని 30 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన ఉంది. ఇక కోటెడ్ పేపర్, పేపర్ బోర్డు, చేతి తయారీ పేపర్ ఉడ్ పల్స్‌లపై పన్ను రెట్టింపు చేసి 20 శాతానికి చేర్చాలని వాణిజ్య శాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే దేశీయ కాగితం పరిశ్రమలపై దిగుమతి వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం దిగుమతి సుంకం విధిస్తున్న చెక్క, లోహ, ప్లాస్టిక్ బొమ్మలపై దిగుమతి సుంకాన్ని 100 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. వీటిని చైనా, హంకాంగ్ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్నది. 2017-18లో 281.82 మిలియన్ల డాలర్ల విలువైన బొమ్మలు దిగుమతి కాగా, 2018-19లో ఇది 304 మిలియన్ల డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నారు. దీనికి అడ్డు కట్ట వేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. 
 

click me!