నిరసనలకు తలొగ్గి...రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపు

By Sandra Ashok Kumar  |  First Published Dec 17, 2019, 11:16 AM IST

జీఎస్టీ పరిహారం బకాయిల చెల్లింపుపై రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేయడం.. దేశవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం.. మరోవైపు జీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణ దిశగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానున్న నేపథ్యంలో కేంద్రం దిగి వచ్చింది. రాష్ట్రాలకు రూ.35,298 కోట్ల జీఎస్టీ నష్టపరిహారం చెల్లించింది.


న్యూఢిల్లీ: జీఎస్టీ నష్టపరిహారం ఆలస్యంపై రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళన ఫలించింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం రూ.35,298 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి జీఎస్టీ నష్టపరిహారం అందడం లేదని, ఆ చెల్లింపులు వెంటనే జరుపాలంటూ దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రల ఆర్థిక మంత్రులు, ఇతర ప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. 

నిర్మలతో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సంప్రదింపులు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ పలుమార్లు వీరంతా చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ రాష్ట్రలకు ఈ బకాయిలను విడుదల చేసింది. ‘ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్’ నినాదంతో 2017 జూలై ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను అమల్లోకి తెచ్చినది తెలిసిందే. 

Latest Videos

undefined

also read రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు..2018-19లో ఆదాయం ఎంతంటే..?

ఇలా జీఎస్టీ రూపాంతరం
అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టాల్లో ఉన్న డజనుకుపైగా పన్నులను ఏకం చేసి పరిచయం చేసిన జీఎస్టీ పరిధిలో 500లకుపైగా సేవలు, 1,300లకుపైగా వస్తువులు ఉన్నాయి. 0, 5, 12, 18, 28 శాతాల్లో ఆయా వస్తు, సేవలపై పన్నులను విధించారు. బంగారంపై ప్రత్యేకంగా మూడు శాతం పన్ను వేయగా, విలువైన ముడి రత్నాలు, రాళ్లపై కనిష్ఠంగా 0.25 శాతం పన్ను నిర్ణయించారు. 

ఐదేళ్లు పరిహారం చెల్లింపునకు కేంద్రం హామీ
ఇక పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చని కేంద్రం.. విద్య, వైద్యం, తాజా కూరగాయలు తదితరాలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో జీఎస్టీ అమల్లోకి తెస్తున్నప్పుడు రాష్ర్టాలకు ఎలాంటి నష్టం వాటిల్లినా పరిహారం ఇస్తామన్న కేంద్రం.. తొలి ఐదేళ్లు ఈ సాయం చేస్తామని హామీ ఇచ్చింది.

రెండున్నరేళ్లకు కేంద్రం కుప్పిగంతులు
రాష్ట్రాల్లోని వివిధ పన్నులను జీఎస్టీలో కలిపేయడమే ఇందుకు కారణం. రెండు నెలలకోసారి ఈ నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రెండున్నరేళ్లకే మొండి చెయ్యి చూపిస్తున్నది. 

బకాయి చెల్లింపుల జాప్యానికి ఇవీ కారణాలు..
ఆర్థిక మందగమనం, జీఎస్టీ వసూళ్లలో క్షీణత మధ్య ఆగస్టు-సెప్టెంబర్ బకాయిలకుతోడు అక్టోబర్-నవంబర్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు రూ.35,298 కోట్లను విడుదల చేసింది.

జీఎస్టీ హేతుబద్దీకరణపై ఆర్థిక సంఘం సంప్రదింపులు
జీఎస్టీ సుస్థిరతకు, పన్ను ఆదాయం పెంపునకు అవసరమైన మార్గాల అన్వేషణ కోసం 15వ ఆర్థిక సంఘం ఆర్థిక సలహాదారు మండలి సోమవారం చర్చించింది. తర్వాత ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ విలేకరులతో మాట్లాడుతూ 18న జరిగే జీఎస్టీ మండలి సమావేశం పరిశీలనకు సిఫాసులను పంపబోతున్నట్లు చెప్పారు. 

also read అప్పులు ఇవ్వడానికి వెనుకాడుతున్న బ్యాంక్‌లు.. పరిశ్రమలకు కష్టాలు

ఏడాదికో ఆర్థిక సంఘం నివేదికలు రూపకల్పన
2020-21 ఆర్థిక సంవత్సరానికి  ఒక నివేదికను, 2021-22 నుంచి 2025-26 వరకు మరో నివేదికను ఆర్థిక సంఘం తయారు చేస్తున్నది. ద్రవ్యోల్బణం, జీడీపీ అంశాలనూ సంఘం పరిశీలిస్తున్నది. ద్రవ్యోల్బణం కట్టడి, వృద్ధిరేటు పురోగతికి ఆచరించాల్సిన చర్యలను కేంద్ర ప్రభుత్వానికి సూచించనున్నది.

మాట తప్పం: నిర్మలా సీతారామన్
జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపు విషయంలో రాష్ర్టాలకు ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి ఉంటుందని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం మాట తప్పబోదని పేర్కొన్నరు. జీఎస్టీ ఆదాయం ఆశించిన స్థాయిలో లేకే రాష్ర్టాలకు నష్ట పరిహారం చెల్లించడం ఆలస్యమైందని చెప్పా రు. సోమవారం ముంబైలో జరిగిన టైమ్స్ నెట్‌వర్క్స్ ఇండియా ఎకనామిక్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు.  

పరిహారం రాష్ట్రాల హక్కు
జీఎస్టీ నష్టపరిహారం పొందడం రాష్ర్టాల హక్కు నిర్మలా సీతారామన్ అన్నారు. దాన్ని  తాము ఏవిధంగానూ అడ్డుకోబోమని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా చెల్లింపులు ఆగలేదన్న ఆమె.. ఇందులో ప్రభుత్వ వైఫల్యంగానీ, నా తప్పుగానీ లేదన్నారు. 

రేపు జీఎస్టీ కౌన్సిల్ భేటీ
బుధవారం జీఎస్టీ మండలి సమావేశం జరుగనున్నది. తగ్గిన జీఎస్టీ వసూళ్లు, రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లింపుపైనే ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరోక్ష పన్ను ఆదాయం క్షీణించడంతో జీఎస్టీ పరిధిలోకి రాని వస్తు, సేవలతోపాటు మినహాయింపు ఉన్న వాటిపైనా పన్ను వేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, డేటా విశ్వసనీయతను పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
 

click me!