నాడు తెలంగాణ, నేడు ఉత్తరాంధ్ర: తెలుగు తమ్ముళ్లకు సెంటిమెంట్ దెబ్బ

By narsimha lodeFirst Published Aug 4, 2020, 12:15 PM IST
Highlights

మూడు రాజధానుల వ్యవహరం ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది. సెంటిమెంట్ వ్యవహారం రాజకీయంగా నష్టం చేసే అవకాశం లేకపోలేదని ఉత్తరాంధ్రకు చెందిన కొందరు టీడీపీ నేతలు లోలోపల మధనపడుతున్నారు


అమరావతి: మూడు రాజధానుల వ్యవహరం ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది. సెంటిమెంట్ వ్యవహారం రాజకీయంగా నష్టం చేసే అవకాశం లేకపోలేదని ఉత్తరాంధ్రకు చెందిన కొందరు టీడీపీ నేతలు లోలోపల మధనపడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి టీడీపీ  వ్యతిరేకం. ఈ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సమర్ధిస్తున్నారు. సెంటిమెంట్ రాజకీయంగా తమకు నష్టచేస్తోందా అనే భయం కూడ కొందరిలో లేకపోలేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ తెలంగాణ ప్రత్యేక  రాష్ట్రం కోసం సాగిన పోరాటంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు రెండు ప్రాంతాలు తనకు రెండు  కళ్లు అంటూ చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఈ ప్రాంతంలోని టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.  ఈ సమయంలో చాలా మంది టీడీపీ నేతలు సైకిల్ దిగి కారెక్కారు. తెలంగాణ ఉద్యమం టీడీపీని తెలంగాణలో తీవ్రంగా నష్టపర్చింది. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు కూడ ఆ పార్టీని మరింత నష్టపర్చాయి.

కేసీఆర్ రగిల్చిన తెలంగాణ సెంటిమెంట్ కు కౌంటర్ ఇవ్వడంలో అప్పటి టీడీపీ నాయకత్వం విఫలమైంది. దీంతో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. రాజకీయంగా తమకు భవిష్యత్తు ఉండదనే కారణంగా చాలా మంది తెలంగాణ టీడీపీ నేతలు  ఆ పార్టీకి అప్పట్లో గుడ్ బై చెప్పారు. 

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఇదే రకమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి. మూడు రాజధానులకు టీడీపీ వ్యతిరేకం. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానికి వ్యతిరేకమని చెబితే  రాజకీయంగా తమకు నష్టమనే కొందరు టీడీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టీడీపీ ప్రకటించింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. అయితే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వద్దని టీడీపీ నేతలు చెబుతున్నారని వైసీపీ నేతలు సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కావాలని స్థానికంగా సెంటిమెంట్ చెలరేగితే టీడీపీ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

also read:అమరావతిపై టీడీపీ, వైసీపీ,జనసేన రాజీనామా సవాళ్లు: వేడేక్కిన ఏపీ రాజకీయాలు

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చింది. అయితే ఏపీ కలిసి ఉండాలని సమైఖ్య ఉద్యమాలు సాగిన సమయంలో స్థానిక టీడీపీ నేతలు కూడ పాల్గొన్నారు. స్థానికంగా ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా  టీడీపీ నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. 

అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రకు కేంద్రమైన విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను కొందరు నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కానీ అంతర్గతంగా సెంటిమెంట్ భయం పట్టుకొందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే రానున్న రోజుల్లో  ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయో చూడాలి.

click me!