నిన్ను సీఎంగా చూడాలని చిన్నాన్న తపించారే.. మరి నువ్వు..:జగన్ కు చిన్నమ్మ ఎమోషనల్ లెటర్  

Published : Apr 25, 2024, 03:04 PM ISTUpdated : Apr 25, 2024, 03:10 PM IST
నిన్ను సీఎంగా చూడాలని చిన్నాన్న తపించారే.. మరి నువ్వు..:జగన్ కు చిన్నమ్మ ఎమోషనల్ లెటర్  

సారాంశం

తన భర్త వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నమ్మ సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాసారు... 

కడప : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. నామినేషన్లకు ఇవాళే(గురువారం) చివరిరోజు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీలో పోటీకి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం ఆయన తన స్వస్థలానికి చేరుకున్నారు. ఇలాంటి సమయంలో జగన్ సొంత చిన్నమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ షాక్ ఇచ్చారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కొడుకు వైఎస్ జగన్ కు ఓ ఎమోషనల్ లేఖ రాసారు. ఆమె చేతిరాతతో వున్న బహిరంగ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. 

''2009 లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోయినపుడు నువ్వు ఎంత మనోవేదన అనుభవించావో... 2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. అప్పటి నుండి ఇంతవరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధించిన విషయం ఏంటంటే మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావడం... వాళ్లకు నువ్వు రక్షణగా వుండటం'' అంటూ సౌభాగ్యమ్మ తన ఆవేదనను కొడుకు వరసయ్యే వైఎస్ జగన్ కు వ్యక్తం చేసారు. 
 
''నిన్ను సీఎం గా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈవిధంగా నీ పత్రిక, నీ టీవీ చానెల్, నీ సోషల్ మీడియా... నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం... మాటల్లో చెప్పలేని విధంగా హననం చేయడం, చేయించడం నీకు తగునా ? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ... నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే... నీకు ఏమాత్రం పట్టడం లేదా ? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటి?  కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం?'' అంటూ వైఎస్ జగన్ ను చిన్నమ్మ సౌభాగ్యమ్మ నిలదీసారు.

''ఇంకా బాధించే విషయం... హత్యకు కారకులైన వారికి మరలా ఎంపీగా పోటీచేసే అవకాశాన్ని నీవు కల్పించడం...ఇది సమంజసమా? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నా. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున... చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం కోసం ఆలోచన చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా... న్యాయం,ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నా'' అంటూ సౌభాగ్యమ్మ భావోద్వేగానికి గురయ్యారు. 

సౌభాగ్యమ్మ స్వయంగా రాసిన లెటర్ : 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu