అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ అమరావతి చుట్టే తిరుగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై అసెంబ్లీని రద్దు చేయాలని టీడీపీ వైసీపీకి సవాల్ విసిరింది. 48 గంటల్లో ఈ విషయమై తన అభిప్రాయాన్ని చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి  ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని వైసీపీ టీడీపీకి సవాల్ విసిరింది.

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు జూలై 31వ తేదీన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ రాజకీయాలు వేడేక్కాయి.2015లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో రాజధానికి శంకుస్థాపన జరిగింది. ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. 

ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.  గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ 23  ఎమ్మెల్యేలకే పరిమితమైంది. వైసీపీకి 151 మంది  ఎమ్మెల్యేలు గెలిచారు.

గత ఏడాది అసెంబ్లీలో మూడు రాజధానులపై జగన్ ప్రకటన చేశారు. దాని తర్వాత వరుసగా పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఈ ఏడాది జూలై 31వ తేదీన గవర్నర్ ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలపడంతో ఈ ప్రక్రియ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

అయితే మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికలకు ముందు వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించని విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికలైన తర్వాత ప్రతిపక్ష నేతగా అమరావతికి జగన్ మద్దతు ప్రకటించిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో రాజధానిని కాకుండా  మూడు రాజధానులకు తెరలేపారన్నారు. మాట తప్పడు, మడమ తిప్పడు అని జగన్ గురించి చెప్పుకొనే వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారని టీడీపీ ప్రశ్నిస్తోంది.

మూడు రాజధానులపై ప్రజా తీర్పు కోరేందుకు  వీలుగా అసెంబ్లీని రద్దు చేయాలని చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ ను కోరారు. ఈ మేరకు 48 గంటల సమయాన్ని ఇస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఒకవేళ ఈ విషయమై ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా అని ఆయన ప్రశ్నించారు.

అయితే టీడీపీ సవాల్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజా తీర్పును కోరాలని వైసీపీ కోరింది. మూడు రాజధానులపై ప్రజలు ఏ రకమైన నిర్ణయాన్ని ఇస్తారో తేలుతోందన్నారు.

ఇదిలా ఉంటే జనసేన కూడ టీడీపీ, వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

also read:మూడు రాజధానులపై టీడీపీకి వైసీపీ కౌంటర్: వల్లభనేనితో బాబుకు జగన్ చెక్

చంద్రబాబు, వైఎస్ జగన్ లు వ్యక్తిగత నిర్ణయాల కారణంగా  ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్సీ బీటేక్ రవి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కౌంటరిచ్చారు. జనసేనకు చెందిన ఒక్క ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని ఆయన కోరారు.

మూడు రాజధానుల బిల్లు, సీఆర్ డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ అమరావతి రైతులు సోమవారం నాడు మూడు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. 

విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది. ఈ తరుణంలో అడ్డుకొనేందుకు విపక్షాలు కూడ తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడ రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితం అమరావతిపై ప్రజాభిప్రాయంగా తీసుకొనేందుకు తాను సిద్దమని కూడ ప్రకటించారు. వంశీ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరమై జగన్ కు జై కొట్టారు.