AP SSC Result 2024 : శభాష్ తల్లీ... కూలీ చేసుకునే ఆడబిడ్డ టెన్త్ టాపర్

By Arun Kumar PFirst Published Apr 23, 2024, 8:23 AM IST
Highlights

పట్టుదల వుంటే ఏదయినా సాధ్యమేనని ఈ బాలిక నిరూపించింది. కష్టాల మధ్య చదువు కొనసాగించిన ఆ బాలిక పదో తరగతి ఫలితాల్లో టాప్ మార్కులు సాధించింది. ఈ చదువుతల్లి సక్సెస్ స్టోరీ ఇదీ.. 

కర్నూల్ : ఆమెది నిరుపేద కుటుంబం... చుట్టూ కష్టాలే. తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది... తండ్రి కూలీ చేసి సంపాదించే డబ్బులు తల్లి వైద్యానికే సరిపోయేవి. మరి కుటుంబానికి పూటగడవడం ఎలా? అందుకే చిన్నవయసులోనే ఆమె కూలీగా మారాల్సి వచ్చింది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కూలీపనులు చేసేది. ఇలా కుటుంబంకోసం కూలీగా మారినా తన భవిష్యత్ కోసం చదువును కొనసాగించింది. ఇలా ఎన్నో కష్టాలు మధ్య చదువును కొనసాగిస్తున్న ఈ ఆడబిడ్డ ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పరీక్షలో చరిత్ర సృష్టించింది. 

ఎవరీ బోయ నవీన? 

కర్నూల్ జిల్లా  చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దకూతురు బోయ నవీన పదో తరగతి, చిన్నకొడుకు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో ఈ ఇద్దరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 

 చదువులేక తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసిన నవీన బాగా చదువుకునేది. చదువే ఒక్కటే తమ జీవితాలను మారుస్తుందని నమ్మేది. కాబట్టి చదువును నిర్లక్ష్యం చేసేది కాదు... చదవేది ప్రభుత్వ పాఠశాలలోనే అయినా ఎంతో శ్రద్ద చూపేది. ఇలా బాగా చదువుతూ పదో తరగతికి చేరింది నవీన. 

అయితే ఇక్కడే ఆమె జీవితంలో మరిన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి. తల్లి వన్నూరమ్మ అనారోగ్యం పాలయ్యింది. ఆమె కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో ఆ కుటుంబం మరింత చితికిపోయింది. తండ్రి కూలీ సంపాదన తల్లి వైద్య ఖర్చులకే సరిపోయేది. దీంతో  కుటుంబ పోషణ బాధ్యతను నవీన తీసుకుంది. లా చిన్న వయసులోనే ఆమె కూలీగా మారింది.

ఓవైపు కూలీ పనులు చేస్తూనే మరోవైపు చదువు కొనసాగించింది నవీన. ఇలా వారంలో మూడురోజులు కూలీ పనులను... మరో మూడురోజులు స్కూల్ కు వెళ్లేది. ఆమె పరిస్థితి గురించి తెలిసిన ఉపాధ్యాయులు కూడా సహకరించేవారు... ఆమెను ఎంతో ప్రోత్సహించేవారు. నవీన కూడా తన ఎంతో శ్రద్దగా చదువుకునేది. ఇలా ఎన్నో కష్టాల మధ్య చదువును కొనసాగించిన బాలిక పదో తరగతి పరీక్ష రాసింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆమె 509 మార్కులు సాధించి సత్తా చాటింది. 

ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో ఈ కూలీ బిడ్డ మండలస్థాయిలో టాపర్ గా నిలిచింది. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా బెదరకుండా చదువు కొనసాగించిన ఈ  చదువులతల్లిని అందరూ అభినందిస్తున్నారు. ఇలా నవీన ఆడబిడ్డలకు ఆదర్శంగా నిలిచింది. 

ఏపీ టెన్త్ రిజల్ట్స్ ఇలా వున్నాయి... 

ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి నిలిచింది. బాలికలు 89 శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలురలది 84 శాతమే. 6,16,615 మంది పదో తరగతి పరీక్ష రాస్తే 5,34,574 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత శాతం 86. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏపీలో ఉత్తీర్ణత శాతం పెరిగింది. 

ఇక రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది కూడా ఓ ఆడబిడ్డే. ఏలూరు జిల్లా ముసునూరు  మండలం రమణక్కపేటకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్విని 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. ఆ తర్వాత రైతు బిడ్డ ప్రణతి 598 మార్కుతో రెండోస్థానంలో నిలిచింది.  

click me!