బల్క్ డ్రగ్ పార్క్‌ వద్దంటూ కేంద్రానికి యనమల లేఖ.. దొందూ దొందే : వైసీపీ, టీడీపీలపై విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 4, 2022, 5:38 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడంలో అధికార, ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయని విమర్శలు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. రాష్ట్రానికి పరిశ్రమలు రాని వేళ బల్క్ డ్రగ్ పార్క్‌ను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు

ఆంధ్రప్రదేశ్‌కు బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాయడంపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి పరిశ్రమలు రాని వేళ బల్క్ డ్రగ్ పార్క్‌ను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పరిశ్రమలను అడ్డుకోవడంలో అధికార, ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయని విష్ణువర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అటు వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చే ప్రాజెక్ట్‌లు మాకొద్దని లేఖలు రాసిందని ఆయన గుర్తుచేశారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎన్డీబీ ప్రాజెక్ట్‌లో భాగంగా తన వాటా ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చిందని.. కానీ నిధులు లేమిని కారణంగా చూపుతూ వైసీపీ లేఖ రాసిందని విష్ణువర్థన్ రెడ్డి దుయ్యబట్టారు. 

అంతకుముందు కాకినాడలో కేంద్రం ఏర్పాటు చేయదలచిన బల్క్ డ్రగ్ పార్క్‌పై అభ్యంతరం తెలిపారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఈ మేరకు గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. ఇక్కడ సెజ్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వ 8,500 ఎకరాల భూమిని సేకరించిందని యనమల ప్రస్తావించారు. అలాగే మత్స్యకారుల ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తామని వైఎస్ హామీ ఇచ్చారని రామకృష్ణుడు పేర్కొన్నారు. 

ALso Read:కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు.. ఇబ్బందులివే : కేంద్రానికి యనమల రామకృష్ణుడు లేఖ

కానీ అందుకు విరుద్ధంగా సీఎం జగన్ అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఫార్మా పార్క్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని యనమల ఆరోపించారు. దీని వల్ల నేల, నీరు, నింగీ, సముద్రం కలుషితమై.. మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. ఫార్మా పార్క్‌ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారని రామకృష్ణుడు లేఖలో పేర్కొన్నారు. 

click me!