తగ్గిన ఆదాయం, సంక్షేమ పథకాల కొనసాగింపు: ఆదాయ మార్గాల కోసం ఏపీ వేట

By narsimha lodeFirst Published Sep 15, 2020, 4:12 PM IST
Highlights

ఒకవైపు తగ్గిన ఆదాయం, మరోవైపు సంక్షేమ పథకాలకు అవసరమైన నిధుల కోసం ఏపీ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతుంది. నిధుల సమీకరణకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు సామాన్యులపై పెద్దగా భారం పడకుండానే ఆదాయాన్ని పెంచుకొనే ప్రయత్నాలు చేస్తోంది.

అమరావతి: ఒకవైపు తగ్గిన ఆదాయం, మరోవైపు సంక్షేమ పథకాలకు అవసరమైన నిధుల కోసం ఏపీ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతుంది. నిధుల సమీకరణకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు సామాన్యులపై పెద్దగా భారం పడకుండానే ఆదాయాన్ని పెంచుకొనే ప్రయత్నాలు చేస్తోంది.

కరోనాతో ఏపీ ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం తగ్గిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సి వచ్చింది. ఉద్యోగుల జీతాలతో పాటు రోజువారీ అవసరాల కోసం అప్పులు చేయడం అనివార్యంగా మారింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

కరోనా దెబ్బకు రాష్ట్రంలో రూ. 15 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. అదే సమయంలో రాష్ట్రప్రభుత్వానికి ఖర్చులు పెరిగిపోయాయి. కరోనా రోగులకు సేవలు అందించడంతో పాటు ఇతరత్రా అవసరాల కోసం సాధారణం కంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

మరో వైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి జగన్ సర్కార్ పై ఉంది. దీంతో సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా ఉండేందుకు గాను ఆదాయం వచ్చే మార్గాలపై ప్రభుత్వం కేంద్రీకరించింది.

సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా సామాన్యులపై భారం లేకుండా ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించడంతో అధికారులు ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించారు.

ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రం రూ. 31వేల కోట్ల అప్పులు తెచ్చింది. కరోనా సమయంలో అప్పుల ద్వారా రాష్ట్రం గట్టెక్కింది. ఈ ఏడాది మే నుండి అదనపు ఆదాయ మార్గాలపై ప్రభుత్వం కేంద్రీకరించింది. మే నుండి ఇప్పటివరకు సుమారు రూ. 15 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకొనేలా ప్లాన్ చేసింది. తాజాగా మరో రూ. 3 వేల కోట్లు అదనంగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ ఏడాది మే మాసంలో మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సుమారు 75 శాతం ధరలను పెంచింది ప్రభుత్వం. ఇటీవల కాలంలో ఈ ధరలను సవరించింది. 71 శాతం మద్యం ధరల పెంపు ద్వారా రూ. 13,500 కోట్ల అదనపు ఆదాయం వస్తోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

also read:ఏపీలో భారీగా పడిపోయిన మద్యం విక్రయాలు: రూ.2,885.82 తగ్గిన ఆదాయం

జూన్ లో పెట్రోల్, డీజీల్ ధరల పెంపు ద్వారా రూ. 600 కోట్లు ఆదాయం వస్తోందని ప్రభుత్వ ఆలోచన.ఆగష్టులో భూముల విలువను పెంచింది. దీని ద్వారా రూ. 600 కోట్లు ఆదాయాన్ని రాబట్టనుంది.ఆగష్టులోనే వృత్తిపన్ను పెంపును పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు అదనంగా  రూ.161 కోట్లు జమకానున్నాయి.నేచురల్ గ్యాస్ పై 10 శాతం వ్యాట్ పెంపు ద్వారా రూ. 300 కోట్లు ఆదాయం వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. 

also read:కరోనా దెబ్బ: రూ. 21వేల కోట్లు అప్పులు తెచ్చిన ఏపీ సర్కార్

ఇక కేంద్రం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురానుంది. ఈ విషయమై ఎంపీలకు సీఎం  జగన్ దిశా నిర్ధేశం చేశారు.

పోలవరం నిర్మాణ ఖర్చులు రూ. 3,232.41 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ. 3622.07 కోట్లు, బియ్యం సబ్సాడీ రూ. 1,728 కోట్లు,14వ, ఆర్ధికసంఘం గ్రాంట్ రూ. 581.60 కోట్లు పెండింగ్ బకాయిలు రాష్ట్రానికి చెల్లించాలని కేంద్రంపై ఎంపీలు ఒత్తిడి తీసుకురానున్నారు. కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు రాష్ట్రానికి చెల్లిస్తే కొంత ఉపశమనం కలుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

click me!