2024 నాటికి భారతదేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముందుకు వెళుతున్నది. అయితే, అంతర్జాతీయంగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరుకోవడంతో అహర్నిశలు దేశ అభ్యున్నతి కోసం ఓ ఆర్థిక వేత్త చేసిన క్రుషి దాగి ఉన్నది. అచేతనావస్థలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు ఆయన. ఆయనే మన్మోహన్ సింగ్. 1991-92లో చెల్లింపులకు రుణాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్.. దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు తెర తీసి విప్లవాత్మక మార్పులతో దేశ పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించారు. నాడు ఆయన తొలి బడ్జెట్ ప్రసంగమే కార్పొరేట్ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిందంటే అతిశయోక్తి కాదు.