న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశ జీడీపీ 11 వసంతాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారీ ఉద్దీపనలు, కార్పొరేట్ పన్నులో కోత, వడ్డీరేట్ల తగ్గింపు తదితర చారిత్రక నిర్ణయాలు తీసుకున్నా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో 2020 బడ్జెట్ అత్యంత కీలకమైంది. 

దీంతో నరేంద్రమోదీ సారథ్యంలోని ప్రభుత్వం మౌలిక వసతుల రంగానికి ఊతమిచ్చేందుకు పలు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి బ్రుహత్తర పథకం ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో మౌలిక రంగం పురోగతికి రూ.105 లక్షల కోట్లు (1.48 ట్రిలియన్ల డాలర్లు) వ్యయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని బడ్జెట్లో ప్రకటించే చాన్స్ ఉంది.

also read Budget 2020:ఆర్థిక రంగానికి రిలీఫ్ ఫండ్... నిర్మలా సీతారామన్... 

2024 నాటికి ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎకానమీని తీర్చి దిద్దే ప్రక్రియలో ఈ భారీ వ్యయం భాగమని కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే 2014లో నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలపై వ్యయం పెరిగింది. 

బడ్జెట్లో ప్రైవేటీకరణ అంశాలు కూడా ప్రతిపాదించే అవకాశం కనిపిస్తున్నది. ఈ ఏడాది ఆదాయంలో భారీగా తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో రూ.1.5 లక్షల కోట్ల మేరకు ప్రైవేటీకరణ లక్ష్యంగా ప్రతిపాదనలు ఉండవచ్చునని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులను ఉపసంహరించడానికి కేంద్రం ప్రతిపాదనలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

  

ఇదిలా ఉంటే, ఆదాయం అంచనాలు, గ్రోత్, బయట నుంచి రుణాల అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశీయంగా డిమాండ్ పెంచడంతోపాటు పెట్టుబడులను పెంపొందించడానికి వ్యక్తిగత ఆదాయం పన్నులో కోత విధించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు, ఆర్థిక నిపుణులు అంటున్నారు.

మరోవైపు బడ్జెట్లో ఆర్థిక ఉద్దీపనలు, రోడ్లు, రైల్వేలు, గ్రామీణ సంక్షేమానికి ప్రభుత్వం చేయనున్న వ్యయాలు గ్రోత్ రేట్ పునరుద్దరిస్తాయని ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారులు అంటున్నారు. బలహీన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు బడ్జెట్లో ఆర్థిక ఉద్దీపనల అవకాశాలను మరింత పెంచుతాయని సింగపూర్ ఆర్థిక వేత్త షిలాన్ షా అంచనా వేశారు. 

also read Budget 2020: అదనపు పన్నులు తొలగించే అవకాశం... గోల్డ్ ఫండ్స్‌కు ఈసారి ఊరట..?

ప్రభుత్వం చేసే వ్యయాలు వచ్చే త్రైమాసికాల్లో గ్రోత్ పెంచుతాయని అంచనావేస్తున్నారు. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యాలు కట్టుదప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ప్రభుత్వ ఆదాయం అంచనాలు రూ.3 లక్షల కోట్ల మేరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్యలోటును మూడు శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల కథనం. 

ద్రవ్యలోటు వ్యయాలను తగ్గించేందుకు 28 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.99 లక్షల కోట్లు)గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. దశాబ్ద కాలంలో బారతదేశ ఆర్థిక వ్యవస్థ తొలిసారి తీవ్రవమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ గ్రోత్ రేట్ 4.7 శాతానికి పడిపోయింది. మరోవైపు నిరుద్యోగం రేటు అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. కార్మిక రంగంలో అడుగు పెడుతున్న యువత సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది.