‘ఎన్నిసార్లు ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రజల సొమ్ము ఇస్తారు..?’.. ‘ఎగ్గొట్టే వాళ్లకు అప్పులిచ్చే బ్యాంకులకు మళ్లీ నిధులు ఇవ్వాలా..?’ బ్యాంకులకు మూలధనం బలపర్చేందుకు నిధులను సమకూర్చినప్పుడల్లా ప్రభుత్వం ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థకు జీవం పోయడం అంత ముఖ్యమా.. అది సామాన్యూలకు ఎలా ఉపయోగపడుతుంది. ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం బ్యాంకింగ్‌ రంగానికి ఎలా సాయం చేసే అవకాశాలు ఉన్నాయి. పరిశీలిద్దాం.. 

ఆర్థిక వ్యవస్థ చాలా శక్తివంతమైంది. దీనిలో ఒక దాని మూలాలు మరో దానిలో ఉంటాయి. వీటిల్లో  ఏ ఒక్కటి దెబ్బతిన్నా.. మిగిలిన రంగాలపై ఆ ప్రభావం పడి ఆర్థిక వ్యవస్థే కుంగిపోతుంది..స్టాక్‌ మార్కెట్లు కుంగిపోతాయి.. కంపెనీ విలువ పడిపోయి అప్పులు పుట్టవు.. ఉన్న కంపెనీలను తక్కువ విలువకు విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. 2008 సబ్‌ప్రైమ్‌ సంక్షోభం లేమాన్‌ బ్రదర్స్‌ మునిగిపోవడంతో తలెత్తింది. ఇది అమెరికాకే ముచ్చెమటలు పట్టించింది.. బ్యాంకింగ్‌ రంగ శక్తి అది. 

also read ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రిలయన్స్‌ రోడ్లు...ఎక్కడో తెలుసా...

ప్రస్తుతం దేశ జీడీపీ 5శాతం కిందకు పడిపోయింది. దేశంలో తయారీ, సేవల రంగం బాగుంటే జీడీపీ వృద్ధిరేటు తేలిగ్గా పెరుగుతుంది. ఇది బాగుండాలంటే.. తయారీదారుల వద్ద పెట్టుబడి ఉండాలి.. కొనేవారి వద్ద నగదు ఉండాలి. ఈ రెండూ జరగాలంటే వ్యవస్థలోకి నగదును చొప్పించాలి. అలాగని ఊరికే డబ్బులు పంచిపెట్టరు కదా.. అలా చేస్తే మరో విధంగా ఆర్థిక సమస్యలు వస్తాయి. అందుకే ప్రభుత్వం అత్యధిక మంది ఉపాధి పొందే రంగాలను ఎంపిక చేసుకొని వాటికి సులువుగా రుణాలను అందజేస్తుంది. 

భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎంఎస్‌ఎంఈ) భారీ సంఖ్యలో ఉన్నాయి. మొత్తం జీడీపీలో ఈ విభాగం వాటా 30శాతానికి సమానం. అంటే దాదాపు మూడోవంతు అన్నమాట. ఇక ఎగుమతుల్లో 50శాతం వాటా వీటిదే. వీటిపై ఆధారపడి 11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో అత్యధిక మంది రుణాలను తీసుకొనే వ్యాపారం చేస్తారు.

వీరికి సరళంగా రుణం అందేట్లు ఉన్న చోట్ల నుంచి అప్పులు తీసుకొంటారు. వీరికి బ్యాంకులే రుణాలను అందించాలి. మరోపక్క ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌  బలపర్చేలా గృహ, ఆటోమొబైల్‌ రుణాలను బ్యాంకులు సులువుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే బాంకులు ఆర్థికంగా పుష్టిగా ఉండాలి.

భారత్‌లో ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులు తీవ్రమైన మొండిబకాయిల సమస్యతో  కొట్టుమిట్టాడుతున్నాయి. మార్చి 2019 నాటికి స్థూలంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.8,06,412 కోట్లు, ప్రైవేటు రంగ బ్యాంకులకు రూ9,42,279 కోట్ల మేర మొండిబకాయిలు ఉన్నాయి. అంటే ఈ రెండు రకాల బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో రూ.17లక్షల కోట్లకు పైగా మొత్తం తిరిగి రాని పరిస్థితి నెలకొందన్న మాట.

ఇచ్చిన అప్పు తిరిగి వస్తే ఆ సొమ్మును బ్యాంకులు మరొకరికి అప్పు ఇచ్చి ఆర్థిక చక్రాన్ని వేగంగా ముందుకు కదిలించవచ్చు. కానీ, అవి తిరిగిరాకపోతే ఆర్థిక చక్రం వేగం మందగించడమో.. ఆగిపోవడమో జరుగుతుంది. ప్రస్తుత మూలధన కొరతతో భారత్‌ బ్యాంకింగ్‌ రంగంలో వేగం మందగించింది. అందుకే అప్పులు వేగంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

రుణాలు ఎగ్గొట్టిన వారిలో ఆర్థికంగా అత్యంత శక్తివంతులు కూడా ఉన్నారు. దివాల చట్టానికి పదును పెట్టడంతో నెమ్మదిగా బ్యాంకులు వసూళ్లను వేగవంతం చేశాయి... కానీ ఈ లోపు ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు నిధులు వాటికి అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం కీలకమైన పలు బ్యాంకుల్లో రూ.70,000 కోట్ల నిధులను సమకూర్చింది.

ఫలితంగా 24 బ్యాంకుల ఎన్‌పీఏల నిష్పతి 5 శాతం కంటే తక్కువకు చేరింది. నాలుగు బ్యాంకుల ఎన్‌పీఏల నిష్పత్తి మాత్రం ఇంకా 20శాతం పైమాటే ఉంది. ఈ బ్యాంకులు పెద్దమొత్తంలో ఇచ్చిన 1.8 శాతం రుణాలు మొండిబకాయిలుగా మారడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2020 బడ్జెట్‌లో వీటికి ఊరటనిచ్చే అంశాలను ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఎన్‌పీఏల దెబ్బకు సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడుతున్నాయి.

ఇవి వేగంగా వృద్ధిరేటు నమోదు చేయకపోవడమే దీనికి కారణం. ఒక వేళ ఇచ్చిన అన్నిరకాల ఛార్జీలు కలుపుకొని దాదాపు 16శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయాలంటే ఎంఎస్‌ఎంఈలకు రుణలభ్యతను కచ్చితంగా పెంచాల్సిందే. 2019లో రుణమేళాలు, ముద్ర రుణాలు వంటి వాటి రూపంలో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

also read స్పేర్ పార్ట్స్ పై కస్టమ్స్ తగ్గించాలి... లేదంటే గ్రే మార్కెట్‌దే హవా

ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా బ్యాంకులు ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వడాన్ని సులభతరం చేయలేదు. ముఖ్యంగా ముద్ర రుణాలు ఎన్‌పీఏలుగా మారుతున్నాయని ఆర్‌బీఐ చేసిన హెచ్చరికలు బ్యాంకులపై బలంగా పనిచేశాయి. మరోపక్క ఎంఎస్‌ఎంఈలకు రుణాలను విస్తృతంగా రుణాలు ఇచ్చే బ్యాంకింగేతర  సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు కూడా నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి.

వీటికి కూడా నిరర్ధక ఆస్తుల సెగ గట్టిగానే తాకింది. గతంలో 6.1శాతం ఉన్న నిరర్ధక ఆస్తులు 2019 సెప్టెంబర్‌ నాటికి 6.3శాతానికి పెరిగాయి. దీనికి తోడు అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో బ్యాంకులు వీటికి రుణాలను ఇవ్వడంలేదు. వీటికి బ్యాంకులు సులువుగా రుణాలు ఇస్తేనే.. ఆ సొమ్మును ఇవి మరొకరికి రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సారి బడ్జెట్‌లో కేంద్రం ప్రభుత్వం ఎన్‌బీఎఫ్‌సీలను, బ్యాంకులను ఆర్థికంగా పరిపుష్టి చేయకపోతే జీడీపీకి 30శాతం భాగస్వామ్యాన్ని అందించే ఎంఎస్‌ఎంఈ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.