ఆడవాళ్లకు ఈ పోషకాలు చాలా చాలా అవసరం.. ఇవి లోపిస్తే ఎన్నో రోగాలొస్తయ్ జాగ్రత్త..
Women’s Day 2023: స్త్రీల శరీరం పీరియడ్స్, ప్రెగ్నెన్సీ నుంచి రుతువిరతి వరకు ఎన్నో మార్పులకు లోనవుతుంది. దీనివల్ల వీరు ఎన్నో రోగాల బారిన పడుతుంటారు. అయితే కొన్ని రకాల పోషకాలు ఆడవాళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.
Women’s Day 2023: ఆడవాళ్లు ఇంటిళ్లి పాది ఆరోగ్యాన్ని పట్టించుకుంటారు. కానీ వాళ్ల ఆరోగ్యం గురించి కొంచెం కూడా పట్టించుకోరు. దీనివల్లే వీరు ఎక్కువగా అనారోగ్య బారిన పడుతుంటారు. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం ప్రతి ఒక్కరికీ అవసరమే. ముఖ్యంగా జీవిత కాలంలో మహిళల శరీరం ఎన్నో శారీరక పరివర్తన చెందుతుంది. అంతేకాదు ఆడవాళ్ల శరీరంలో ఎన్నో పోషకాలు లోపిస్తాయి. పోషకాలు లేకపోతే ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే ఆడవారు ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఎలాంటి జబ్బులు రాకూడదన్నా.. కొన్ని పోషకాలను ఖచ్చితంగా తీసుకోవాలి. అవేంటంటే..
ఇనుము
పీరియడ్స్ లో బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల మహిళల శరీరంలో ఇనుము పుష్కలంగా ఉండదు. ఇనుము పెరుగుదలకు, శరీర కణజాలాలకు ఆక్సిజన్ ను తీసుకువెళ్ళడానికి, కొన్ని హార్మోన్లను సృష్టించడానికి అవసరం. ఇనుము లోపం రక్తహీనత సమస్యకు కారణమవుతుంది.
విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్
శరీరంలో కొత్త కణాలను పుట్టించడానికి విటమిన్ బి చాలా అవసరం. అయితే ఫోలిక్ ఆమ్లం గర్భధారణ సమయంలో న్యూరల్ ట్యూబ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది శిశువు మెదడు, వెన్నుపాము అభివృద్ధికి సహాయపడుతుంది. గింజలు, బీన్స్, పాలకూర, నారింజ రసంలో విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ డి
మన దేశంలో విటమిన్ డికి కొదవే లేదు. కానీ మనదేశంలోనే ఎక్కువ మంది ఈ పోషక లోపంతో బాధపడుతున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టు గుర్తించారు. విటమిన్ డికి ఉత్తమ, సహజ వనరు సూర్యుడు. కానీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడూ సూర్యరశ్మిలో ఉండటం సాధ్యం కాకపోవచ్చు. ఎముకలను బలంగా ఉంచేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు, శరీరంలో మంటను తగ్గించేందుకు, కణాల పెరుగుదలకు విటమిన్ డి చాలా అవసరం. గుడ్డు, పుట్టగొడుగులు, పాలు వంటి వివిధ ఆహారాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
కాల్షియం
ఎముకల ఆరోగ్యానికి ఈ పోషకం చాలా అవసరం. ఒంట్లో కాల్షియం లోపిస్తే బోలు ఎముకల వ్యాధి నుంచి బలహీనమైన ఎముకలు, ఎముకల పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీ శరీరంలో కాల్షియం లోపించకుండా జాగ్రత్త పడాలి. యుక్తవయస్సులో కాల్షియాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఎముకలు కాల్షియంను బాగా గ్రహిస్తాయి. పాలు, జున్ను, పెరుగు వంటి ఆహారాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
మెగ్నీషియం
ఆరోగ్యకరమైన గర్భధారణకు ఈ పోషకం అవసరం. మెగ్నీషియం కండరాలు, నరాలు సరిగ్గా పనిచేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిని, రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. బచ్చలికూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడికాయ విత్తనాలు, అవోకాడోల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.