నా రాజకీయ జీవితంలో చూసిన గొప్ప సీఎం ఆయనే..: మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రిని తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేనని అన్నారు.
దేవరుప్పల: "తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూసి విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది. అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి. అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోవడంలేదు. నిజానికి సిఎం కెసిఆర్, వ్యవసాయాన్ని పండుగ చేశారు. బడ్జెట్ లో పేద రైతులకు పెద్ద పీట వేశారు. కెసిఆర్ లాంటి సీఎంని, ఇలాంటి బడ్జెట్నీ నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేద"ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి గౌరవ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఈ బడ్జెట్ లో విమర్శలకు తావు లేదని, విమర్శలకు, విమర్శించే వాళ్లకు విలువేలేదని ఆయన అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి, దేవరుప్పల మండలం కడవెండి శివారులోని వాన కొండయ్య శ్రీలక్ష్మి నరసింహ దేవాలయ దర్శనం కోసం వెళ్లారు.
read more వాన కొండయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఎర్రబెల్లి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''రైతే రాజు అన్నోల్లే కానీ రైతు సంక్షేమం కోసం పాటు పడ్డ సీఎం లను నేను ఇంత వరకు చూడలేదు. నా 40 ఎండ్ల రాజకీయ జీవితంలో కెసిఆర్ లా రైతుల బాగు, సంక్షేమం కోసం పని చేసిన సీఎంలు రాలేదు. అనుకున్నది చేసే పట్టుదల ఉన్న మనిషి కెసిఆర్'' అని అన్నారు.
వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కెసిఆర్ దే అన్నారు. సాగునీటి కోసం కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీం లతో కెసిఆర్ తెలంగాణ పాలిట అపర భగీరథడు అయ్యారని ప్రశంసించారు. సాగునీటితో తెలంగాణని కోటి ఎకరాల మాగాణి చేశారన్నారు. 24గంటల పాటు ఉచిత విద్యుత్, రైతు బంధు, రుణ మాఫీ, రైతు వేదిక, రైతు బీమాలకు భారీగా నిధులు కేటాయించారన్నారు. ప్రాజెక్టులు, సాగునీరు, ఉచిత విద్యుత్ సరేసరి అన్నారు.
విమర్శలకు తావులేదు, విమర్శించే వాళ్ళకు విలువే లేదన్నారు. రైతు సంక్షేమాన్ని వ్యతిరేకించేవాళ్ళు ప్రజాసేవకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. కొన్ని వర్గాల, ధనిక ప్రజల స్వలాభానికి ఆలోచించేవాళ్ళని, వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనేకసార్లుగా బలపరుస్తూనే ఉన్నారన్నారు.
ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు కెసిఆర్ కి, టిఆర్ఎస్ కి మద్దతుగా నిలిచారన్నారు. విమర్శించేవాళ్ళకు అధికారం దూరమై, భవిష్యత్తు అంధకార బంధురమై, దిక్కుతోచక, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ప్రతిపక్ష రాజకీయ పార్టీలను సునిశితంగా విమర్శించారు. అధికార దాహంతో మతి భ్రమించి చేసే ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని మంత్రి విమర్శించారు.