వాన కొండయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుఖ శాంతులతో, సుభిక్షంగా ఉండాలని వాన కొండయ్య స్వామిని కోరుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి సమీపంలోని కడవెండి గ్రామ శివారులో వెలిసిన లక్ష్మీనర్సింహస్వామికి ఆయన మొక్కులు తీర్చుకున్నారు.
కడవెండి (దేవరుప్పుల): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏలుబడిలో తెలంగాణ రాష్ట్ర సుఖ శాంతులతో, సుభిక్షంగా ఉండాలని వానకొండయ్య కొండపై నెలవై ఉన్న శ్రీలక్ష్మీ నర్సింహస్వామిని కోరుకున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీన నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం కడవెండి శివారు వానకొండయ్య కొండపై వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారికి మంత్రి సంప్రదాయ బద్ధంగా మగ్గం నేసి, పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... ముక్కోటి దేవతల ఆశీస్సులతో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనలో బంగారు తెలంగాణగా మారుతున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇప్పటికే ఆ నీటితో చెరువులు నిండాయన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అద్బుతంగా సాగుతున్నదన్నారు.
గతంలో ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని దేవాలయాలకు కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించిన ఘనత సిఎం కెసిఆర్ దే అన్నారు. దేవాలయాల జీర్ణోద్ధరణకు నడుం బిగించింది కెసిఆరే అన్నారు. అర్చకులకు వేతనాలు సకాలంలో అందేలా చూస్తున్నామన్నారు. అలాగే వానకొండయ్య శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రతి ఏడాది హోలీ పండుగకు ముందు రోజు శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వివాహ వేడుకతో ప్రారంభమై, ఉగాది వరకు సాగే ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. 150ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ గుడికి కడవెండి పద్మశాలీలు ప్రత్యేకంగా ఎడ్లబండి లేదా ట్రాక్టర్ పై అమర్చిన మగ్గంపై నేసిన వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. కాగా, ఈ వానకొండయ్య కొండకు లంబాడా గిరిజనులు కూడా అధికంగా హాజరవుతారు. అంతకుముందు మంత్రి దయాకర్ రావుకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు.