Asianet News TeluguAsianet News Telugu

ఆ సాయానికి రిటర్న్ గిఫ్టే స్థానికసంస్థల ఎన్నికల వాయిదా: నిమ్మగడ్డపై దాడి ఫైర్

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసిపి సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. స్థానికసంస్థల ఎన్నికల వాయిదా చంద్రబాబుకు రమేష్ కుమార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని అన్నారు. 

YSRCP Leader Dhadi Veerabhadra Rao Shocking Comments on EC
Author
Visakhapatnam, First Published Mar 17, 2020, 10:25 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పొలిటికల్‌ కమిషన్‌లా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్చిన్నం చేసే పరిస్థితికి రావడం దురదృష్టకరమన్నారు. మంగళవారం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా పేరుతో రాజ్యాంగ హక్కులు కాలరాయడం సరికాదన్నారు. 

ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసి మళ్లీ సమీక్ష అంటే నిరవధిక వాయిదా వేసినట్లేనని వ్యాఖ్యానించారు. సీఎస్‌కు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖాధికారులతో మాట్లాడినట్లు ఎన్నికల కమిషనర్‌ చెబుతున్నారని. నిన్న చంద్రబాబు ఇచ్చిన స్పీచ్‌నే ఈ రోజు కమిషనర్‌ సీఎస్‌కు రాసిన లేఖ అని దుయ్యబట్టారు.  ఎన్నికల వాయిదా వేయాలనుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలా వద్దా అని ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని ఎలా చెబుతారరంటూ.. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే సీఎస్‌ను, ఇక్కడి అధికారులను ఎందుకు సంప్రదించలేదని నిలదీశారు. చంద్రబాబు డైరక్షన్‌లో ఎన్నికల‌ కమిషనర్ పనిచేస్తున్నారని విమర్శించారు. 

ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు ఆపు చేయాలని కూడా భావిస్తున్నారని చెప్పారని, అక్కడ ఎన్నికల ప్రక్రియే ప్రారంభం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మరో మూడు రోజులలో ఎన్నికలు పూర్తి అయిపోతాయని, కేంద్రం నుంచి రూ.5800 కోట్ల నిధులపై మీరు ఎలా మాడ్లాడతారని కమిషనర్‌ను ప్రశ్నించారు. మీరేమైనా ప్రధానమంత్రా.. రాష్ట్రపతా.. మీరు ఏవిధంగా హామినిస్తారని ధ్వజమెత్తారు.

‘ఆరువారాల పాటు ఎన్నికల‌ కమిషన్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పడం ద్వారా పరిపాలన ఆగిపోవాలని మీరు‌ కుట్రలు చేశారు. పాలన స్తంభించి పోవాలని చంద్రబాబు‌ కుట్రలో మీరు భాగస్వాములయ్యారు. మీరు చేసిన తప్పుపై మీలో పశ్చాత్తాపం లేదు. రిటైర్ అయిన అధికారిని చంద్రబాబు నియమించారు కాబట్టి ఆయనకి ఎన్నికల‌ కమీషనర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మీరు కరోనా వైరస్ కారణంగా వాయిదా వేశారా..శాంతి భధ్రతల‌ సాకు చూపి వాయిదా వేశారా.. ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారో ఎన్నికల‌ కమిషనర్‌కే తెలియదు’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios