Asianet News TeluguAsianet News Telugu

సింహాచలం అప్పన్న బంగారం పేరిట... రూ.1.44 కోట్లకు టోకరా

 సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం బంగారాన్ని విక్రయిస్తున్నట్టుగా నమ్మించి రూ.1.44 కోట్లకు టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

woman cheeting in simhachal
Author
Simhachalam, First Published Sep 3, 2020, 1:27 PM IST

విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం బంగారాన్ని విక్రయిస్తున్నట్టుగా నమ్మించి రూ.1.44 కోట్లకు టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. 

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జూలై నెలలో అప్పటి ఈవో డి.భ్రమరాంబకు ఒక ఫోన్‌ వచ్చింది. తన పేరు ఎం.శ్రావణి అని, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన తాను దేవస్థానం వద్ద రూ.1.44 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేశానని ఎప్పుడు ఇస్తారని అడిగింది. కంగుతిన్న ఈవో భ్రమరాంబ ఆలయ ఏఈవో పి.రామారావు ఫోన్‌ నంబర్‌ను శ్రావణికిచ్చి పూర్తి వివరాలు ఆయనకు తెలియజేయాలని సూచించారు.  

దీంతో శ్రావణి ఏఈవోకి ఫోన్‌ చేసి తాను సింహాచలం కొండపై ఉంటున్న కోన హైమావతి అనే మహిళ ద్వారా దేవస్థానం బంగారం అమ్ముతోందని తెలుసుకుని ఆమెకు రూ.1.44 కోట్లు ఇచ్చి బంగారం కొనుగోలు చేశానని చెప్పింది. ఆ బంగారాన్ని తనకు ఎప్పుడు అప్పగిస్తారని అడిగింది. దేవస్థానం బంగారం అమ్మకాలు ఏమీ చేయదని ఏఈవో చెప్పారు. 

ఆ మహిళ ఈవో డి.భ్రమరాంబ సంతకం, దేవస్థానం స్టాంప్‌తో రూ.1.30 కోట్లు, రూ.14 లక్షలు ఉన్న రెండు టాక్స్‌ ఇన్వాయిస్‌ క్యాష్‌ బిల్లులను ఏఈవో వాట్సాప్‌కు పంపించింది. సదరు బిల్లుల్లో కొనుగోలు చేసిన వస్తువుల వివరాలు కూడా ఉన్నాయి. విషయాన్ని ఈవో భ్రమరాంబ దృష్టికి ఏఈవో తీసుకెళ్లగా ఆ బిల్లులు నకిలీవని, సంతకం కూడా ఫోర్జరీ చేసిందని గుర్తించారు. ఈ విషయాన్ని శ్రావణికి కూడా తెలియజేసి ఆలయంలో బంగారం విక్రయించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయినా శ్రావణి ఆలయ అధికారులకు పదేపదే ఫోన్‌ చేస్తుండటంతో ఎట్టకేలకు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పూనుకున్నారు.  

ఇదిలావుండగా శ్రావణి దేవస్థానం ఏఈవోకి వాట్సప్‌లో పంపిన బిల్లు మద్దూరు నాగేంద్రకుమార్‌ పేరిట ఉంది. ఈ విషయాన్ని ఏఈవో శ్రావణిని అడగ్గా.. అది తన భర్తదని, ఆయన ఇస్రోలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారని తెలిపింది. తమకు ఆలయంతో ఎలాంటి సంబంధం లేదని, హైమావతికే క్యాష్‌ ఇచ్చామని తెలిపారు. 

సింహాచలం ఆలయంలో ఏటా బంగారు బిస్కెట్లు వేలం వేస్తారని, ఈ సారి కరోనా కారణంగా ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా బంగారం వేలం వేస్తున్నారని, మీరు రూ.1.44 కోట్లు ఇస్తే బిస్కెట్లు తీసిస్తానని నమ్మబలికిందని ఆమె వాపోయారు. ఆ మాటలను నమ్మి జూన్‌ 27న రూ.కోటి నేరుగా, మరో రూ.44 లక్షలు బ్యాంక్‌ ఖాతాల ద్వారా చెల్లించామన్నారు. రసీదులు పంపే వరకు అవి నకిలీవని మాకు కూడా తెలియదని చెప్పారు. అయితే హైమావతి తమను తెలివిగా మోసం చేసి రూ.1.44 కోట్లు నగదు తీసుకుందని, ఆమెపై తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios