విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాల సీజన్‌ నేటితో ముగియనుంది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు అక్టోబరు 16న దక్షిణాదిలో ప్రవేశించి నేటితో అంటే జనవరి 10వ తేదీతో పూర్తిగా వెనక్కివెళ్లిపోయాయి. ప్రతిసారీ విద్వంసాన్ని సృష్టించే ఈ రుతుపవనాలు ఈసారి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ పై కరుణను ప్రదర్శించాయి. 

సాధారణంగా ఈ సీజన్‌ అంటేనే తుఫాన్ల కాలంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఏపీ, తమిళనాడులను కనీసం రెండుమూడు తుఫాన్లు ఈ రుతుపవన కాలంలో తాకి విధ్వంసం సృష్టిస్తుంటాయి.  అయితే ఈ ఏడాది మాత్రం ఈశాన్య రుతుపవనాలు ప్రశాంతంగా వెనుదిరిగాయి. 

బంగాళాఖాతంలో కేవలం ఒకే ఒక తుఫాను ఏర్పడినా అది కూడా పశ్చిమ బెంగాల్‌లో తీరం దాటింది. వాయుగుండం ఏర్పడి ఒడిశా దిశగా పయనించింది. ఇలా ఏపీ తీరాన్ని తుఫాన్లు తాకకపోవడంతో నవంబరు, డిసెంబరు నెలల్లో భారీవర్షాలు కురవలేదు. ఫలితంగా వరి, ఇతర పంటలకు ముప్పు తప్పింది. 

కాగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌(అక్టోబరు, నవంబరు, డిసెంబరు)లో ఏపీలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ మూడు నెలల్లో 290.7 మి.మీ.లకు గాను 269 మి.మీ. వర్షపాతం నమోదైంది. కోస్తాలో ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.