విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విశాఖపట్నంలో ఎదురు దెబ్బ తగలనుంది. టీడీపీ సీనియర్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా పాయకరావుపేటలో కూడా టీడీపి ఓటమి పాలైంది. అంతేకాకుండా టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయి కలిసే అవకాశం కల్పించడం లేదు. ఈ నేపథ్యంలో నగేష్ టీడీపి కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

దాంతో నగేష్ టీడీపీకి రాజీనామా చేసే ఉద్దేశంతో తనకు పట్టున్న గ్రామాల్లో పర్యటించి తన మద్దతుదారులను కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు బిజెపి నేతలతోనూ మరో వైపు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారు. 

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు కర్ జీ ఇటీవల నగేష్ నివాసానికి వచ్చారు. దీంతో ఆయన బిజెపిలో చేరాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బిజెపి నేతలతో బుధవారం ఆయన పూర్తి స్థాయి చర్చలు జరిపారు. గురువారం ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉంది.