Asianet News TeluguAsianet News Telugu

వేధింపులు తట్టుకోలేకపోతున్నా...నన్ను బదిలీచేయండి: సింహాచలం మాజీ ఈవో భ్రమరాంబ లేఖ

తనను ఈవో బాధ్యతల నుంచి తప్పించాలంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు మాజీ ఈవో లేఖ రాసినట్లు తాజాగా భయటపడింది. 

Simhachalam Ex EO Bramaramba  letter to edowement officer
Author
Visakhapatnam, First Published Sep 4, 2020, 7:15 PM IST

విజయనగరం: సింహాచలం ఆలయ కార్య నిర్వహణాధికారి (ఈవో)గా పనిచేసిన భ్రమరాంబ ఇటీవలే బదిలీ అయిన విషయం తెలిసిందే. అయితే తనను ఈవో బాధ్యతల నుంచి తప్పించాలంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు గత వారం లేఖ రాసినట్లు... అందువల్లే ఆమె బదిలీ అయినట్లు తాజాగా బయటపడింది.   వేధింపులను తట్టుకోలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

''ఆలయానికి సంబంధంలేని వ్యక్తి రికార్డులను ఎలా పరిశీలిస్తారు? ఆయనకు దేవస్థానం నిధులు ఎందుకు ఖర్చు చేయాలి? దీనిపై వివరణ ఇవ్వండి'' అంటూ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఛైర్‌పర్సన్‌ సంచయితా గజపతిరాజుకు మొన్నటి వరకు ఈవోగా పని చేసిన భ్రమరాంబ లేఖ రాశారు. ఈ నెల ఒకటిన ఆమె బదిలీ కాగా అందుకు రెండు రోజుల ముందు ఆమె ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.  ఈ లేఖను దేవాదాయశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకూ ఆమె పంపినట్లు సమాచారం. 

లేఖలో భ్రమరాంబ ప్రస్తావించిన అంశాలివీ..

''కార్తీక సుందరరాజన్‌ సింహాచలం కొండపై 2 ఏసీ గదులతో ఉండే అన్నపూర్ణ కాటేజీలో మే 30 నుంచి ఉంటున్నారు. నిత్యం ఆయనకు అల్పాహారం, భోజనం తదితరాలకు ఆలయ నిధులను వెచ్చిస్తున్నారు.  ఛైర్‌పర్సన్‌ చెప్పారంటూ పరిపాలన, భూ విభాగాల రికార్డులను తెప్పించుకుని ఆయన పరిశీలిస్తున్నారు. ఆలయ భూ పరిరక్షణ విభాగానికి ఉన్న వాహనాన్ని తనకు అవసరం ఉన్నప్పుడల్లా సుందరరాజన్‌ ఉపయోగించుకుంటున్నారు. వంట తదితర పనులకు అయిదుగురు సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఛైర్‌పర్సన్‌ ఇంటికి, సుందరరాజన్‌ ఉండే అతిథి గృహంలో వంట చేసేందుకు కలిపి రెండు గ్యాస్‌ సిలిండర్లను ఆలయ ఏఈవో సమకూర్చారు'' అని భ్రమరాంబ లేఖలో పేర్కొన్నారు.

ఆలయ ఛైర్‌పర్సన్‌ను ఉద్దేశించి సుందరరాజన్‌ విషయంపై ఈ లేఖ రాశారు.  ఎలాగూ ఆలయ విధుల నుంచి తప్పిస్తారనే భావనతో విషయాలన్నీ అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

 అయితే ఆలయ ఛైర్‌పర్సన్‌ తన ఓఎస్డీగా సుందరరాజన్‌ను నియమించాలని భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఇటీవల జరిగిన పాలకవర్గ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారట. అందులో ఆయనకు జీతం, వాహనం, ఇతర వసతులను సమకూర్చాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై తొలుత సభ్యులు అభ్యంతరం తెలిపినా తరువాత నిబంధనలు ఎలా ఉంటే అలా చేయాలని నిర్ణయించారట. అయితే నిబంధనల మేరకు బయటి వారిని ఇలా నియమించే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఆలయ సిబ్బందిలో ఎవరినైనా ఛైర్‌పర్సన్‌కు సహాయంగా ఉండేందుకు సమకూరుస్తారని పేర్కొంటున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios