విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, పార్టీ రాష్టర్ లీగల్ సెల్ కార్యదర్శి మద్దువలస చిరంజీవి హత్య కుట్రను విశాఖపట్నం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో టీడీపీ ఎంపీటీసీ అమ్మినాయుడు ప్రధాన నిందితుడిగా తేలింది. తనకు రాజకీయంగా అడ్డు వస్తున్నాడనే కక్షతో చిరంజీవి హత్యకు అమ్మినాయుడు కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. 

కేసుకు సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ ఆర్కె మీనా శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన వైసీపీ నేత చిరంజీవిని హత్య చేసేందుకు విశాఖకు చెందిన రౌడీ షీటర్ కన్నబాబుకు సుపారీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కన్నబాబు ముఠాపై గతంలో పలు కేసులున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. 

రాజకీయ ప్రత్యర్థిని అంత చేయాలనే కుట్రతో టీడీపీ నేత అమ్మినాయుడు సుపారీ ముఠాతో 50 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. అడ్వాన్స్ గా నాలుగు లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. 

ముఠాకు చందిన ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి మూడు కత్తులు, ఆర్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని మీనా చెప్పారు. చిరంజీవిని చంపేందుకు వారు రెండు సార్లు రెక్కీ నిర్వహించారని, హత్యకు ప్రయత్నించి విఫలమయ్యారని ఆయన అన్నారు తమకు అందిన సమాచారం సుపారీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశామని చెప్పారు 

ప్రధాన నిందితుడు కొత్తకోట అమ్మినాయుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. అరెస్టయినవారిలో కిల్లి ప్రకాష్, రాజాన కన్నబాబు, గంటా రామరాజు, ఆసనాల ఏసుదాస్, బోనెల పరమేష్, పసిగడ అనిల్ కుమార్ ఉన్నారు. 

ప్రధాన నిందితుడు అమ్మినాయుడు ఎచ్చెర్ల మండలం ఫరీద్ కోటకు టీడీపీ ఎంపీటీసీగా ఉన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత చౌదరి బాబ్జీకి ముఖ్య అనుచరుడని కమిషనర్ చెప్పారు. అరెస్టయినవారిలో కిల్లి ప్రాక,్ విశాఖలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు.