విశాఖ రాంకీ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదంపై  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందడంపై ఆవేదన  వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుడు శ్రీనివాసరావు కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. 

విశాఖ లో వరుస ప్రమాద ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తరువాత అన్ని జాగ్రత్తలు  తీసుకున్నాం ఇక మీదట ప్రమాదలు జరగవు అని ప్రభుత్వం, మంత్రులు ప్రకటనలు చేసారు.  ఆ తర్వాత సాయినార్ కెమికల్స్, ఇప్పుడు రాంకీ ప్రమాదాలకు ఏం సమాధానం చెబుతారు'' అంటూ  లోకేష్ ప్రశ్నించారు.

 

''రాంకీ ఎస్ఈజెడ్ లో 15 రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయి.ఈ ఘటనల పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలి. బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని నారా లోకేష్ డిమాండ్ చేశారు. 

read more  విశాఖ ఫార్మా సిటీలో ప్రమాదం: బయటపడిన మృతదేహం, శ్రీనివాస్ గల్లంతు

విశాఖపట్నంలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సాల్వెంట్స్ ఫార్మా కంపెనీలోని ట్యాంకు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనలో కాండ్రేగుల శ్రీనివాస్ (40) ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 

సాల్వెంట్స్ ఫార్మా కంపెనీలో శ్రీణివాస్ సీనియర్ కెమిస్ట్ పని చేస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో నలుగురు సిబ్బంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడు
 మల్లేశ్వరరావును గాజువాక ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 

పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. యాజమాన్యం వైఫల్యం  కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.