విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని  జోన్ 6 కార్యాలయంలో ఓ మహిళా అధికారిణిపై హత్యాయత్నం జరిగింది. ఓ మహిళ తన సమస్యపై ఫిర్యాదు అందించడానికని కార్యాలయంలోని అధికారిణి రూమ్ లోకి వెళ్లి ఆమెపై పెట్రోల్ పోయడంతో పాటు తనపైనా పోసుకుని నిప్పంటిచడానికి ప్రయత్నించింది. అయితే వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా మహిళను అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  జీవీఎంసీ జోన్ 6 కార్యాలయంలో డాక్టర్ డి లక్ష్మీ తులసి అసిస్టెంట్ మెంటల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అయితే ఈమె జోన్ 5కి ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. 

అయితే 68 వార్డులో సూపర్ వైజర్ గా అన్నమని అనే మహిళ అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్నారు. అయితే గతంలో అత్యవసర సమయంలో పదిరోజుల పాటు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో ఆమె శాలరీని నిలిపివేశారు. అలాగే వార్డులో గొడవల కారణంగా కూడా ఈమెపై కేసు నమోదయ్యింది. ఈ వ్యవహారాలన్నింటిని పరిష్కరించాల్సిందిగా సదరు మహిళ లక్ష్మీతులసిని గతకొంత కాలంగా వేడుకుంటోంది. 

అయితే పోలీసులు పరిధిలోని విషయం కావడంతో అధికారిణి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో సదరు లక్ష్మీతులసిపై కోపం పెంచుకున్న మహిళ ఇవాళ ఆమెపై హత్యాయత్నానికి ప్రయత్నించింది. జోన్ 6 కార్యాలయంలోనే ఆమెపై పెట్రోల్ పోసి ఆ తర్వాత తనపై కూడా పెట్రోల్  పోసుకుని హత్య, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

వెంటనే అక్కడున్న మిగతా సిబ్బంది అన్నమనిని అడ్డుకున్నారు. ఆమె చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ ను లాక్కుని అక్కడినుండి బయటకు లాక్కుని వెళ్లారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.