కరోనా నియంత్రణ దిశగా మరో ముందడుగు...విశాఖలో మొబైల్ కోవిడ్ పరీక్షలు
ప్రతీ జిల్లాకు కోవిడ్ ఖర్చుల నిమిత్తం కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.
విశాఖపట్నం: ప్రతీ జిల్లాకు కోవిడ్ ఖర్చుల నిమిత్తం కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. చినవాల్తేరులో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంజీవని మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వాహనాలను ఆయన గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విశాఖ జిల్లాకు 5 బస్సులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇందులో అనకాపల్లి డివిజన్ కు ఒకటి, నర్సీపట్నం డివిజన్ కు ఒకటి, పాడేరు డివిజన్ కు ఒకటి చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు. సిటీలో రెండు బస్సులు ఉండి పరీక్షలు ఉంటాయని చెప్పారు.
దేశంలో అత్యధిక కోవిడ్ పరీక్షలు చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటి మాత్రమేనన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 12 లక్షలు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కోవిడ్-19 కు వ్యాక్సిన్ వచ్చే వరకు శీఘ్రంగా టెస్ట్ లను నిర్వహించేందుకు నిమిత్తం మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వాహలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రాణహాణి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని... క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్య మైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు.
ప్రజల ప్రాణాల భద్రతకు ప్రభుత్వం చిత్తశుద్థితో కృషి చేస్తోందన్నారు. రెవెన్యూ, పోలీసు, వైద్యాధికారులు, వాలంటీర్లు కోవిడ్ కట్టడికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి అందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు.
read more ఏపీలో కరోనా వ్యాప్తి: ఇతర రాష్ట్రాల్లో నేతల చికిత్స, జగన్ కు చిక్కులు
రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి విద్య, వైద్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువ మంది కరోనా బారీన పడకుండా ఉండేందుకు టెస్టులు మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చొరవతో సంజీవని మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వాహనాలను ప్రవేశ పెట్టినట్లు వివరించారు.
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ... బస్సుకు ఒక్కొక్క వైపున 5 శ్యాంపిల్ కలెక్షన్ సెంటర్లు ఉండి ఒక బస్సులో మొత్తం 10 శ్యాంపిల్ కలెక్షన్ కేంద్రం ఉంటాయని చెప్పారు. సంజీవని మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వాహనాలు సేవలను మారుమూల గ్రామాల ప్రజలు వినియోగించుకోవచ్చునని చెప్పారు. కంటైన్ మెంట్ జోన్ లో 80 శాతం వరకు పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో మొబైల్ కోవిడ్ పరీక్షలు చేయవచ్చునన్నారు. బస్సులు సామర్థ్యం 10 మంది సిబ్బంది ఒకేసారి పరీక్షలు చేయడం వలన వందలాది పరీక్షలు చేయవచ్చునని, రోజుకు సుమారు 3 వేల నుండి 3500 వరకు పరీక్షలు చేయవచ్చునన్నారు.
ర్యాపిడ్ టెస్టులు వలన 25 నుండి 30 నిమిషాల మధ్య పరీక్ష ఫలితం వెలువడే అవకాశం ఉందన్నారు. శ్వాబ్ కలెక్షన్ అనంతరం అప్ లోడ్ చేసుకొనే వెసులుబాటు ఉందన్నారు. రెండవ దశలో మరిన్ని బస్సులు వస్తాయని చెప్పారు. మొబైల్ కోవిడ్ పరీక్షలు చేయడానికి ప్రజలు అందుబాటులో ఉండాలన్నారు.
ఈ సమావేశంలో విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, నగర పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ, శెట్టి ఫాల్గుణ, డిసిపి ఐశ్వర్య రస్తోగి, ఎఎంసి ప్రిన్సపాల్ పి.వి. సుధాకర్, ఆర్డిఓ పెంచల కిశోర్, డిఎంహెచ్ఓ తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.