ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శుక్రవారం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆటో డ్రైవర్‌ షర్టు వేసుకుని ఆటో నడిపారు. కాగా విశాఖ బీచ్‌రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి గురజాడ కళాక్షేత్రం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.

అనంతరం గురజాడ కళాక్షేత్రంలో వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రారంభించారు. లబ్ధిదారులకు పదివేల రూపాయల చొప్పున చెక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ...

తొలిసారిగా ఆటో నడిపే అవకాశం కలిగిందన్నారు.  ఏ ఉద్యోగం లేని వ్యక్తులకు తొలి ఉద్యోగం ఇచ్చేది ఆటో మాత్రమేనని చెప్పారు.  రవాణా సదుపాయాలు లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో కష్టాలు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసునని ఆయన అన్నారు. గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేది ఆటో డ్రైవర్లేనని చెప్పారు.  ఆటో డ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసి వారి కోసం వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారని చెప్పారు.

ఈ పథకం ద‍్వారా ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.  అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని తమ ప్రభుత్వం అనుకుంటున్నట్లు వివరించారు.  సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అవంతి మండిపడ్డారు.

నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటో డ్రైవర్లకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు.  తమది పేదల ప్రభుత్వమని..పేదల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వమని చెప్పారు.  ప్రభుత్వంపై చేసే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ప్రజలను కోరారు.విశాఖ జిల్లాలోనే ఆటో డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఏటా రూ.25 కోట్లుయ అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.