శ్రీకాకుళం: కుటుంబ కలహాలతో  ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పంటపొలాల్లొ కొట్టడానికి తీసుకువచ్చిన పురుగుల మందు త్రాగిన మహిళను ఆస్పత్రికి తీసుకుని వెళుతుండగా మృతిచెదింది. 

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ పల్లివీధికి చెందిన బి.మహాలక్ష్మి(35) సోమవారం ఉదయం ఇంట్లో వున్న పురుగుల మందు తాగింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించగా వారు మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించాలని సూచించారు. దీంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో మహాలక్ష్మి మృతిచెందింది. 

మృతదేహానికి కోవిడ్ పరీక్షల నిమిత్తం రాగోలు జెమ్స్ కి తరలించారు. కోవిడ్ పరీక్ష అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణమై వుంటుందని ప్రాథమికంగా తేల్చారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఈ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.