విశాఖపట్నం: పరాయివాడి మోజులో కట్టుకున్నవాడినే ఓ వివాహిత అతి దారుణంగా హతమార్చిన దారుణం విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడి సాయంతో భర్తను అతి దారుణంగా హతమార్చింది కసాయి మహిళ.  

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం ఈదటం గ్రామానికి చెందిన  గంపల పెదవీరబాబు హత్యకు గురయ్యాడు. భార్య వివాహేత సంబంధమే అతడి హత్యకు కారణమని తెలుస్తోంది. అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వీరుబాబు భార్య తమ సంబంధానికి అడ్డంకిగా మారిన భర్తను అతి దారుణంగా హతమార్చింది.

అక్రమసంబంధానికి అడ్డుగా వున్న భర్త వీరబాబును హతమార్చేందుకు ప్రియుడి సాయాన్ని తీసుకుంది ఆ కసాయి భార్య. వీరబాబు ఇంట్లో నిద్రిస్తుండగా ప్రియుడికి సమాచారం అందించింది. దీంతో అతడు ఇనుప రాడ్ తో అక్కడికి చేరుకుని వీరబాబు తలపై బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై వీరబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. 

వీరబాబు హత్యకు గురయినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పాయకరావు పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.  అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.